సినిమా రివ్యూ : వండర్ ఉమెన్ 
రేటింగ్ : 3.25/5
నటీనటులు : నదియా, నిత్యా మీనన్, పార్వతి తిరువొతు, పద్మప్రియ, అర్చనా పద్మిని, అమృతా సుభాష్, సయొనారా ఫిలిప్, ప్రవీణ్ ప్రేమ్‌నాథ్, సందేశ్ కులకర్ణి, హ్యారిస్ సలీమ్, పద్మ గోమతి తదితరులు
ఛాయాగ్రహణం : మనీష్ మాధవన్ 
సంగీతం : గోవింద్ వసంత
నిర్మాతలు : రోనీ స్క్రూవాలా, ఆశీ దువా సారా  
రచన, దర్శకత్వం : అంజలి మీనన్ 
విడుదల తేదీ: నవంబర్ 18, 2022
ఓటీటీ వేదిక : సోనీ లివ్ 


మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్ (Anjali Menon) కు తెలుగు ప్రేక్షకుల్లోనూ అభిమానులు ఉన్నారు. మోడ్రన్ మలయాళ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా ఆవిడను పేర్కొంటారు. 'బెంగళూరు డేస్', 'ఉస్తాద్ హోటల్' సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. ఆ చిత్రాలు తీసిన అంజలీ మీనన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'వండర్ ఉమెన్' (Wonder Women Movie). తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నదియా, నిత్యా మీనన్‌తో పాటు ప్రముఖ మలయాళ కథానాయిక పార్వతి తిరువొతు, పద్మప్రియ తదితరులు నటించారు. సోనీ లివ్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే (Wonder Women Review)?     


కథ (Wonder Women Story) : నందిత (నదియా) ప్రెగ్నెంట్స్‌కు స్పెషల్ క్లాసులు తీసుకుంటారు. సుమన పేరుతో ఆమె నిర్వహించే సెంటర్‌లో గర్భవతులు ఏయే వ్యాయామాలు చేయాలి? ఎలా ఉండాలి? వంటివి చెబుతారు. కొత్త బ్యాచ్‌లో నోరా (నిత్యా మీనన్), మినీ (పార్వతి తిరువొతు), వేణి (పద్మప్రియ), సయా (సయనోరా ఫిలిప్), జయ (అమృతా సుభాష్), గ్రేసీ (అర్చనా పద్మిని) చేరతారు. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ, ఒక్కో నేపథ్యం! అక్కడ క్లాసుల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు? ఎవరెవరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి? ఏమైంది? అనేది సినిమా.
    
విశ్లేషణ (Wonder Women Telugu Review) : 'వండర్ ఉమెన్' కథ కాదు... జీవితం! మనం రోజూ చూసే సమాజం! సినిమా నిడివి ఎక్కువేం కాదు... 1.20 గంటలు! స్టార్ట్, ఎండింగ్ పాయింట్స్ మధ్య ఎక్కువ వ్యత్యాసం కనిపించదు. మొత్తం చూశాక... ఈ సినిమాలో ఏముంది? అని కొందరికి అనిపించవచ్చు. లోతుగా చూస్తే... ఎంతో విషయం ఉందనిపిస్తుంది. అంజలీ మీనన్ కొత్త కథేమీ చెప్పలేదు. కానీ, ప్రతి  ఒక్కరికీ అవసరమైన విషయాన్ని వీక్షకుడికి చేరేలా కొత్తగా చెప్పారు.


'వినా: స్త్రీ యా: జననం నాస్తి, వినా: స్త్రీ యా: జీవం నాస్తి' అంటారు. అంటే... 'స్త్రీ లేకపోతే జన్మ లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు' అని అర్థం. స్త్రీని శక్తిస్వరూపిణిగా వర్ణిస్తారు. 'వండర్ ఉమెన్'లో గొప్పతనం ఏంటంటే... కాబోయే అమ్మను ఆదిశక్తిగా చూపించలేదు. ఆమె కూడా మహిళే. ఆమెకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పారు. ఓ సన్నివేశంలో నేను ఏమీ దైవాన్ని కాదు, సాధారణ మహిళనని సయనోరా ఫిలిప్ చేత డైలాగ్ చెప్పించారు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను చాలా చక్కగా సినిమాలో వివరించారు. 


వేణికి తోడుగా రోజూ అత్తగారు క్లాసుకు వస్తుంటారు. ఓ రోజు భర్తను రమ్మని అడుగుతుంది. అమ్మను తీసుకువెళ్ళమని భర్త చెబితే... 'నేను చేసుకున్నది మీ అమ్మనా? నిన్నా?' అని అడుగుతుంది. భర్త అవసరం ఎంతనేది ఆ తర్వాత సన్నివేశంలో వివరించారు. అలాగని, వేణి మాటలు అత్త వింటుంది. అలాగని కోడలి మీద కోపం పెంచుకోదు. అర్థం చేసుకుంటుంది. ఈ తరహా సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి.


బిడ్డ పుట్టిన తర్వాత ఎలా ఎత్తుకోవాలి? ఎలా ఉండాలి? అని ఓ క్లాసు ఉంటుంది. ఆ సన్నివేశంలో పార్వతి తిరువొతు నటన కంటతడి పెట్టిస్తుంది. అంతకు ముందు ఏం జరిగింది? తర్వాత ఏం అవుతుంది? అనేది మర్చిపోతాం. చేతిలో బొమ్మను ఇవ్వడానికి పార్వతి నిరాకరిస్తుంటే... నానమ్మను పట్టుకుని ఏడుస్తుంటే... ఆ దృశ్యాలు మనసును మీటతాయి. కళ్ళు చెమ్మగిల్లుతాయి. కడుపులో బిడ్డ కోసం విడాకులకు సిద్ధపడిన పార్వతి తిరువొతు కథ మనసును హత్తుకుంటుంది.
 
తల్లి కాబోయే ముందు తన తల్లితో మాట్లాడాలని నిత్యా మీనన్ పడే ఆరాటం, బిడ్డ కోసం ఆమె తన ప్రయారిటీస్ మార్చుకోవడం... ఈ తరహా మహిళలు మనకు సమాజంలో కనిపిస్తారు. ప్రసవంలో బిడ్డను కోల్పోతే ఆ మహిళ వేదన ఏ విధంగా ఉంటుందనేది నదియా పాత్ర ద్వారా, బిడ్డ కోసం లేటు వయసు దంపతులు చేసే ప్రయత్నాలను అమృతా సుభాష్ పాత్ర ద్వారా చూపించారు. ప్రతి పాత్రతో మనం ఏదో విధంగా రిలేట్ అవుతాం.
 
పార్వతి, నిత్యా మీనన్, నదియా, పద్మప్రియ... ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని కాదు. పాత్రలకు జీవం పోశారు. కొన్నిసార్లు విపరీతమైన పాజిటివిటీ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ, ప్రస్తుత సమాజానికి అది అవసరం. సగటు సినిమాల్లో కనిపించే మలుపులు, మెలోడ్రామా 'వండర్ ఉమెన్'లో ఉండవు. మనకు తెలిసిన కథను కొత్తగా మనసుకు చూపించే చిత్రమిది. గోవింద్ వసంత్ సంగీతం, మనీష్ మాధవన్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
  
Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా 'వండర్ ఉమెన్'. దీన్ని కథగానో, సినిమాగానో కాకుండా... సమాజానికి అవసరమైన చక్కటి సందేశంగా చూస్తే మంచిది. సందేశం అనగానే క్లాసులు పీకడం వంటివి ఉండవు. సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటుంది... చక్కటి సంగీతం, సినిమాటోగ్రఫీతో!


Also Read : 'మసూద' రివ్యూ : భయపెట్టడం కోసమే తీసిన సినిమా - భయపెట్టిందా? లేదా?