బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘గదర్2‘ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా, వసూళ్లు వర్షం కురిపిస్తూనే ఉంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేర్ చేస్తోంది. దైవభక్తి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 550 కోట్లు వసూళు చేసింది. భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇంతకు ముందు రెండో స్థానంలో ఉన్న ‘బాహుబలి 2‘ రికార్డ్స్ ను ను ఈ చిత్రం బ్రేక్ చేసింది. ప్రస్తుతం భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ కొనసాగుతుండగా, రెండోస్థానంలో ‘గదర్ 2’ నిలిచింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.
రెమ్యునరేషన్ పెంపుపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘గదర్ 2’ అద్భుత విజయం నేపథ్యంలో సన్నీ డియోల్ తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో సన్నీ డియోల్ తన రెమ్యూనరేషన్‌ను రూ. 50 కోట్లకు పెంచారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలను సన్నీ డియోల్ కొట్టిపారేశారు. తాను డబ్బు కోసమే సినిమాలు చేయనని వెల్లడించారు. నటుడికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలనేది ఆ మూవీ ద్వారా ఎంత సంపాదిస్తామనే దాన్ని బట్టి నిర్మాతలు నిర్ణయిస్తారని చెప్పారు. ప్రొడ్యూసర్ తనకు రూ. 50 కోట్లు ఇవ్వచ్చు అనుకుంటే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. తాను అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టును నుంచి తప్పుకోలేదన్నారు. డబ్బుల కోణంలో తన ఆలోచన ఉండదని చెప్పారు.
ఇక ‘గదర్ 2’ గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. వాస్తవానికి ఇది చాలా పాత మూవీలా అనిపిస్తుందన్నారు. కానీ, ఇప్పుడున్న కాలానికి అనుగుణంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. వాస్తవానికి సినిమా తీసే విధానం మారలేదని, కేవలం సాంకేతికత అభివృద్ధి చెందుతోందన్నారు. మన సంస్కృతి, విలువలు, చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటాయని చెప్పారు. ‘గదర్ 2’ మూవీ 2001లో విడుదలైన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథా’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందింది.
యంగ్ హీరోలకు సన్నీ కీలక సూచనలు
ఇక తాజాగా సన్నీ డియోల్ కొత్త తరం నటుల వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ నటులు, బాడీ బిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేసి నటన మీద ఫోకస్ పెడితే బాగుంటుందన్నారు. "బాడీబిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేయండి. నటనపైనే దృష్టి పెట్టండి. మీలో ఉన్న ప్రతిభను ముందుకు తీసుకెళ్లండి. ఎందుకంటే మనకు కావల్సింది నటన అనేది గమనించండి. మీరేమి బాడీ బిల్డర్లు కాదు. మీరు ఫిట్‌గా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. అంతేతప్ప కండలే ప్రామాణికం అనుకోండి” అంటూ సటైర్లు వేశారు.
Read Also: సౌత్ లో ఆ హీరోతో మాత్రం చేయదట- అతిలోక సుందరి కూతురు వింత నిర్ణయం!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial