చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌పై గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. రెండు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న భేటీ ఇవాళ జరిగింది. ఈ ఉదయం అపాయింట్‌మెంట్ తీసుకొని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను టీడీపీ బృందం కలిసింది. 
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం గవర్నర్‌ను ఈ ఉదయం కలిసింది. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన విషయంతోపాటు శనివారం నుంచి జరిగిన పరిణామాలు వివరించారు. విశాఖలోని పోర్టు గెస్ట్‌హౌస్‌లో టీడీపీ లీడర్లు గవర్నర్‌ను కలిశారు. 


గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చెన్న.. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రతిపక్ష పార్టీకి నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు. 


చంద్రబాబును జైలుకు పంపించాలనే ఉద్దేశంతోనే ఆయనకి కూడా తెలియకుండానే అరెస్టు చేశారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు అచ్చెన్న. మానసికంగా ఆరోగ్యపరంగా కుంగదీయాలనే 48 గంటల పాటు తిప్పారని వివరించారు. ఎన్ని చేసినా చంద్రబాబు మనోధైర్యాన్ని ఎప్పటికీ తొలగించలేరని కచ్చితంగా న్యాయపోరాటంలో విజయం సాధిస్తామన్నారు. టీడీపీకి ఇలాంటి సమస్యలు కొత్తకాదని ప్రజల ముందుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు. 


వైసీపీ నేతలకు ఓడిపోతున్నామని తెలిసే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు అచ్చెన్న. ఇది అక్రమైన అరెస్టు అని ప్రజలకు ప్రభుత్వంలో ఉన్న వారందరికీ తెలుసన్నారు. న్యాయం బతికి ఉందన్న ఆశతోనే ముందుకు వెళ్తున్నాం అన్నారు. నాలుగున్నర ఏళ్ల నుంచి ఇదిగో అదిగో అని బెదిరిస్తూ వచ్చారని చివరకు అక్రమంగా జైలుకు పంపించారన్నారు.