అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అందాల తార జాన్వీ కపూర్. 2018లో ‘ధడక్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చింది. ఆ సమయంలో ఆమె చాలా విమర్శలు ఎదుర్కొంది. బాలీవుడ్ కొన్ని కుటుంబాల చేతిలో కీలు బొమ్మలా మారిందనే మాటలు వినిపించాయి. కానీ, ఆమె నటించిన తొలి రొమాంటిక్ డ్రామా ‘ధడక్’ కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆమె నటన పట్ల ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత’ గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల  ‘బవాల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చక్కటి నటనతో అలరించింది.  ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటు సౌత్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమాలో నటిస్తోంది.


సౌత్ సినిమాల విషయంలో బోనీ కపూర్ వింత కండీషన్!


 చాలా కాలంగా సౌత్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తుంది జాన్వీ కపూర్. దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా కాలంగా తెలుగు సినిమా చేయబోతుందని ఊహాగానాలు వినిపించగా, ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో తెలుగు తెరపై తొలిసారి కనిపించబోతోంది. ‘దేవర’పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు తమిళ పరిశ్రమ నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆమె ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  అంతేకాదు, జాన్వీ తమిళ సినిమాలకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.  తమిళ సినిమాల్లో నటించే ముందు ఆమె తండ్రి ఓ కండీషన్ పెట్టారట. హీరో ధనుష్ తో మాత్రం సినిమా చేయకూడదన్నారట. హీరో విజయ్‌ లేదంటే అజిత్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని చెప్పారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ధనుష్ తో ఎందుకు నటించకూడదని ఆమె తండ్రి నిర్ణయం తీసుకున్నారు? అనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.  


వరుస చిత్రాలతో జాన్వీ  ఫుల్ బిజీ


ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తోంది.  ప్రస్తుతం రాజ్ కుమార్ తో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ నటిస్తోంది. లో రాజ్‌కుమార్ రావుతో కలిసి కనిపించనుంది. గుల్షన్‌ తో కలిసి  ‘ఉలాజ్‌’ లో నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జంగిల్‌ పిక్చర్స్‌ సంస్థ  నిర్మిస్తుంది.  యువ ఐఎఫ్‌ఎస్‌ అధికారి పాత్రలో జాన్వీ కనిపించనుంది. అటు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది.  ఈ సినిమాకు టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. 






Read Also: బిగ్ బాస్ నుంచి కిరణ్‌ రాథోడ్‌ ఔట్, వారం రోజుల్లో ఆమె ఎంత సంపాదించిందో తెలుసా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial