ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ చెన్నైలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఆదివారం నాడు(సెప్టెంబర్ 10న) నిర్వహించిన ఈ ఈవెంట్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. గ్రౌండ్ కెపాసిటీ మించి టికెట్లు అమ్మడంతో అక్కడికి వెళ్లిన అభిమానులు చాలా ఇబ్బంది పడ్డారు. నిర్వహకులు కనీస భద్రతా ఏర్పాటు పర్యవేక్షించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వాహకుల తీరుపై సంగీత ప్రియుల ఆగ్రహం


“ఇదో భయంకరమైన అనుభవం. చెత్త సౌండ్ సిస్టమ్స్, జీరో క్రౌడ్ కంట్రోల్. నిర్వాహకులు కెపాసిటీ మించి చాలా ఎక్కువ టిక్కెట్లు అమ్మారు. ఆలస్యంగా వచ్చిన వారందరూ, కూర్చున్న వారి ముందు నిలబడ్డారు. ముందుగా వచ్చిన వారు షో చూడలేకపోయారు. రెహమాన్ ఈవెంట్ మేనేజింగ్ టీమ్ పనితీరు అత్యంత దారుణంగా ఉంది” అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 10 వేల ఆక్యుపెన్సీ ఉన్న గ్రౌండ్ లో ఏకంగా లక్ష టికెట్లు అమ్మారంటూ మరో నెటిజన్ మండిపడ్డారు.






ఇక ఈ షో కోసం ఓ కుటుంబం ఏకంగా రూ. 30 వేలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసింది. ఈవెంట్ కు వచ్చిన తర్వాత వారి పరిస్థితి దారుణంగా మారింది. చిన్న పిల్లలతో వచ్చిన వారికి కనీసం భద్రత కనిపించలేదు. తొక్కిసలాట నడుమ తమ పిల్లలతో బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. మరికాసేపు అక్కడే ఉంటే తమ పిల్లలను తొక్కి చంపేసే వారని కంటతడి పెట్టుకుంది.  






ఇక తాను పాల్గొన్న అత్యంత చెత్త మ్యూజికల్ కాన్సర్ట్ ఇదేనని శ్రీదేవి అనే మీడియా పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “వీఐపీ జోన్ టికెట్ ధర ఒక్కోదానికి రూ. 250 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూళు చేశారు. వారికి కనీసం భద్రత లేదు. వీఐపీ ఏరియాలో కూర్చున్న వారికి కనీసం స్టేజి కూడా సరిగా కనిపించలేదు. అంతేకాదు వీఐపీల భద్రత కోసం కనీసం బౌన్సర్లు ఏర్పాటు చేయలేదు.  ఎవరుపడితే వాళ్లు వీఐపీ జోన్ లోకి వచ్చేస్తున్నారు.  పరిస్థితి చూస్తే తొక్కిసలాట లాగే కనిపించింది. ఇంత చెత్త మ్యూజికల్ కాన్సర్ట్ నేను ఎప్పుడూ చూడలేదు” అని ట్వీట్ చేశారు.










మరోవైపు గ్రౌండ్ బయట రోడ్డు మీద వెళ్లే వాహనదారుల పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. మ్యూజికల్ కాన్సర్ట్ జరగే గ్రౌండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేవలం 6 కిలో మీటర్లు ప్రయాణించడానికి తనకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. నిర్వాహకులు సరైన పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వేలాది కార్లు రోడ్డు మీదే పెట్టారని ఆయన మండిపడ్డారు.   






గత నెలలో జరగాల్సిన మ్యూజికల్ కాన్సర్ట్ వర్షంతో వాయిదా


నిజానికి చెన్నైలో తాజాగా నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ గత నెలలోనే జరగాల్సి ఉంది. అయితే, సరిగ్గా షో నిర్వహించే రోజునే వర్షం పడటంతో నెల రోజుల పాటు షోను వాయిదా వేశారు.  


Read Also: ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే‘ సీక్వెల్ కు రెడీ- దర్శకుడి ట్వీట్ కు త్రిష ఇంట్రెస్టింగ్ రిప్లై!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial