స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ అంటూ మరికొంతమంది దోపిడీలను కులవృత్తిగా చేసుకుని సామాన్యులను భయపెడుతుంటే వారిని సంస్కరించి పునరావాసంకల్పించేందుకు బ్రిటిష్ వాళ్లు అక్కడక్కడ పీనల్ కాలనీలను ఏర్పాటు చేసారు . అలాంటి కాలనీల్లో ఒకటి గుంటూరుజిల్లాలోని స్టూవర్ట్ పురం. నాటి బ్రిటిష్ హోం సెక్రెటరీ హెరాల్డ్ స్టువర్ట్ పేరు మీద ఈ కాలనీకి స్టువర్ట్ పురం అని పెట్టారు.అప్పట్లో ఈ ఊరి పేరు చెబితే చాలు జనం భయపడేవారు . దానితో ఈ ఊరి పేరు ను క్యాష్ చేసుకోవడానికి టాలీవుడ్ 90 లలోనే ప్రయత్నించింది . కానీ ఎందుకో స్టువర్ట్ పురం పేరున్న సినిమాలు గానీ ,ఆ ఊరు ఇతివృత్తం గా సినిమాలు గానీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని అందుకున్నాయి . ఎంత పెద్ద హీరో నటించినా కూడా స్టువర్ట్ పురం కథలతో వచ్చిన సినిమా అంటేనే డిజాస్టర్ అన్న అభిప్రాయం అప్పటి నిర్మాతల్లో పేరుకుపోయింది అంటారు .
స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
చిరంజీవిని మెగాస్టార్ మార్చిన సినిమాల్లో అధికభాగం ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ కథల ఆధారంగా రూపొందినవే . అభిలాష ,రక్త సింధూరం ,రాక్షసుడు ,దొంగమొగుడు (నల్లంచు తెల్లచీర ), మరణ మృదంగం . ఇవన్నీ యండమూరి నవలల ఆధారంగా రూపొందినవే . వీటిలో చాల సినిమాలకు కోదండరామిరెడ్డి ,రాఘవేంద్ర రావు లు దర్శకత్వం వహించారు . ఇలా నవలలు కాకుండా స్వయంగా చిరంజీవి కోసం డైరెక్టుగా సినిమాలకు కూడా రచయితగా యండమూరి కొన్ని కథలు అందించారు . వాటిలో జగదేక వీరుడు -అతిలోక సుందరి ఒకటి . అయితే ఆ సినిమాకంటే ముందు యండమూరి రాసిన నవల "స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ " . ఈ నవలను సినిమాగా తెరకెక్కించాలనుకున్నప్పుడు నిర్మాత KS రామారావు యండమూరినే డైరెక్ట్ చేయమన్నారు . తనకు ఎన్నో బ్లాక్ బస్టర్ కథలనిచ్చిన యండమూరి డైరెక్టర్ అంటే చిరంజీవి కూడా ఎంకరేజ్ చేశారు . ఇళయరాజా మ్యూజిక్ . విజయశాంతి ,నిరోషా లు హీరోయిన్ లు . ఇంతపెద్ద కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 9 జనవరి 1991న విడుదల అయ్యింది . ఇందులో స్టూవర్టుపురాన్ని సంస్కరించాలనుకున్న ఇనస్పెక్టర్ గా చిరంజీవి నటించారు .అంతకుముందు చిరంజీవి పోలీస్ క్యారెక్టర్లు వేసిన సినిమాలన్నీ హిట్టే . కానీ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది .
స్టువర్ట్ పురం దొంగలు (1991)
చిరంజీవి సినిమా పేరు స్టువర్ట్ పురం తో వస్తుండడం తో ఆ పేరు కొచ్చిన క్రేజ్ ను వాడుకోవడానికి మరో సినిమా స్టువర్ట్ పురం దొంగలు అంటూ అదే ఏడాది రిలీజ్ అయ్యింది . అప్పటికి మాస్ హీరోగా పేరున్న భాను చందర్ ,లిజీ హీరో హీరోయిన్లగా ఈ సినిమాలో నటించగా ,యాక్షన్ సినిమాల డైరెక్టర్ సాగర్ దర్శకత్వం వహించారు . అయితే ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయింది .
జైత్రయాత్ర (1991)
శివ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి వచ్చిన నాగార్జున హీరోగా ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా జైత్రయాత్ర . విజయశాంతి హీరోయిన్ . ఈ సినిమాలో స్టూవర్టుపురం పేరు వాడకపోయినా కథాంశం మాత్రం అక్కడిదే. తన ఊరి జనాల్ని కొంతమంది పెద్దలు ఎలా దొంగలుగా వాడుకుంటున్నారు అని తెలిసి వారిని సంస్కరించే పాత్రలో నాగార్జున నటించారు . అయితే సినిమా టైటిల్ యాక్షన్ సినిమాదిగా ఉండడం స్టోరీ ఏమో కొంత ఆర్ట్ మూవీలా సాగడంతో నాగార్జున కు అప్పుడున్న శివ క్రేజ్ తో ఈ సినిమా సరితూగలేదు . అందుకే ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది . విచిత్రంగా ఇది కూడా 1991 లోనే రిలీజ్ కావడం విశేషం .
మళ్ళీ ఇన్నాళ్లకు స్టూవర్టుపురం దొంగ కథతో ఒకే ఏడాది రెండు సినిమాలు :
మళ్ళీ 30 ఏళ్ల తర్వాత స్టువర్ట్ పురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు కథతో టాలీవుడ్ లో రెండు సినిమాలు రూపొందుతున్నాయి . 19970-80 దశకాల్లో పోలీసులకు దొరకకుండా దొంగతనాలు చేస్తూ రాబిన్ హుడ్ ఇమేజ్ పొందిన టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ అంటూ టాలీవుడ్ లో రెండు సినిమాలు రూపొందుతున్నాయి . చివరకు పోలీసుల చేతుల్లోనే చనిపోయిన టైగర్ నాగేశ్వర రావు కథ అయితే ప్రస్తుతం నడుస్తున్న యాంటీ హీరో స్టోరీల ట్రెండ్ కు సెట్ అవుతుందనుకున్నారేమో ఏమో కానీ స్టార్ హీరో రవితేజ టైగర్ సినిమాను పట్టాలెక్కించారు .దానికంటే ముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇదే కథ తో స్టువర్ట్ పురం దొంగ అనే మరో సినిమా కూడా నిర్మాణం జరుపుకుంటున్నట్టు ఆ చిత్ర బృందం తెలిపింది . ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్ లు కూడా రిలీజ్ అయి చాలా కాలమైంది . అయితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా విషయంలో కాస్త స్తబ్దత నెలకొంది . రవితేజ సినిమా మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది . మరి ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయా లేదాయే అన్నది చూడాలి . ఆ అలాగే స్టూవర్టుపురం కథతో హిట్ కొట్టడం అన్నది కలగానే ఉన్న టాలీవుడ్ సెంటిమెంట్ కు రవితేజ బ్రేకులేస్తారా అన్నది కూడా ఇప్పుడు ఆశక్తికరంగా మారింది .