ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది.


ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కొద్దిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే 'పుష్ప' సినిమాలో చాలా మంది విలన్స్ ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త విలన్ వచ్చి చేరబోతున్నారు. మొదటి పార్ట్ లో బన్నీకి సపోర్ట్ గా ఉండే ఎంపీ రోల్ లో రావు రమేష్ కనిపించారు. ఎర్ర‌చంద‌నం సిండికేట్ మొత్తాన్ని పుష్ప చేతిలో పెట్టి వెనుక ఉంటూ కథ నడిపిస్తారు. ఇప్పుడు పార్ట్ 2లో పుష్పను ఇబ్బంది పెట్టే ఓ పొలిటీషియన్ రోల్ ఉంటుందట. 


ఫహద్ ఫాజిల్ తో కలిసి సదరు పొలిటీషియన్ బన్నీతో ఫైట్ కి దిగుతాడట. ఆ పాత్రలో పేరున్న నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం ఆదిపినిశెట్టి లాంటి స్టార్స్ ను పరిశీలిస్తున్నారు. గతంలో బన్నీ నటించిన 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి. త్వరలోనే విలన్ గా ఎవరిని తీసుకున్నారో అనౌన్స్ చేయనున్నారు. 


 'పుష్ప' సినిమాకి క్రేజీ డీల్:


'పుష్ప' పార్ట్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. 'పుష్ప'తో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట ఓ సంస్థ. మైత్రి మూవీస్ బ్యానర్ ఈ డీల్ పై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బన్నీ మాత్రం వద్దని చెప్పారట. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పారట. దీంతో ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ను పక్కన పెట్టేశారు. 'పుష్ప' పార్ట్ 1 సమయంలో మాత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను ముందే అమ్మేశారు. ఈసారి మాత్రం అలా చేయడం లేదు.  


సుకుమార్ కి బన్నీ డెడ్ లైన్:


దర్శకుడు సుకుమార్ కి ఈ సినిమా విషయంలో బన్నీ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. వందరోజుల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని చెప్పాడట బన్నీ. 2022 దసరా నాటికి 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు. 


Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్


Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్