CM Jagan Tour: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైయస్సార్ జిల్లా పర్యటించబోతున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 1వ తేదీ షెడ్యూల్..
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం బయలుదేరనున్న సీఎం, 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం కాంప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేయనున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీ షెడ్యూల్..
ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి, 9.00 – 9.40 గంటల వరకు ఎస్టేట్‌లోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం వరకు సమీక్షా సమావేశాల అనంతరం ఎస్టేట్‌లోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.
సెప్టెంబర్ 3 షెడ్యూల్..
ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చివరి నిమిషంలో ఆగిపోయిన నెల్లూరు పర్యటన
ఇటీవల నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారై అర్థాంతరంగా ఆగిపోయింది. ఆగస్టు 30న సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారని, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ చివరి నిముషంలో ఆ పర్యటన వాయిదా పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం జగన్ వస్తారని అంటున్నారు. సెప్టెంబర్ 4న సీఎం పర్యటన ఖరారైందని, అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అంటున్నారు.
ఎందుకీ మార్పు?
సీఎం జగన్ పర్యటన వాయిదా పడటానికి ప్రధాన కారణం సంగం బ్యారేజ్ వర్క్స్ పూర్తి కాకపోవడమేనంటున్నారు. ఇటీవల సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ పనులను మంత్రులు, జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించారు. దాదాపు పనులు పూర్తవుతున్నాయని సీఎం రావడమే ఆలస్యం అనుకున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా సీఎం జగన్ ని కలసి సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఆ తర్వాతే సీఎం పర్యటన 30న ఖాయమైందంటూ అధికారిక ప్రకటన విడుదలైంది.
చవితి సెంటిమెంట్ ఉందా?
వినాయక చవితికి ముందు ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవం చేపట్టడం కంటే.. చవితి వెళ్లిపోయిన తర్వాత ఆ రెండు ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తే బాగుంటుందనే సెంటిమెంట్ కూడా ఉంది. దీంతో ఈ ప్రారంభోత్సవాలను వారం రోజులపాటు వాయిదా వేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద జగన్ పర్యటన ఖరారైందని అధికారిక ప్రకటన విడుదలైన తర్వాత అది వాయిదా పడటం మాత్రం విశేషమే.