అప్పుడప్పుడు ప్రయాణాలు చాలా విసుగెత్తిస్తుంటాయి. అనుకున్న సమయానికి వెళ్లాలని త్వరగా రెడీ అయినా.. ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించవు. మరికొన్నిసార్లు వెళ్లాలి అనుకున్న బస్సో, రైలో, విమానమో ఆలస్యం అవుతాయి. ఆ సమయంలో మనకు ఎంతో కోపం వస్తుంది. తాజాగా సంగీత జ్ఞాని ఇళయరాజాకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా విమానాశ్రయంలో ఏడు గంటల పాటు పడిగాపులు పడాల్సి వచ్చింది.
భారీ వర్షాలతో అంతరాయం
తాజాగా రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన ఇళయరాజా ఎప్పటి లాగే తన సినిమాలతో, సంగీత కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే అంగేరిలో జరిగే ఓ సంగీత కచేరీకి వెళ్లాలి అనుకున్నారు. దుబాయ్ మీదుగా అక్కడికి చేరుకోవాల్సి ఉంది. ఆదివారం తెల్లవారు జామున రెండు గంటలకు విమానం చెన్నై నుంచి దుబాయ్ బల్దేరనుంది. అనుకున్న సమయాని కంటే ముందే ఇళయరాజా చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే అతడి సహనానికి పరీక్ష మొదలయ్యింది. శనివారం రాత్రి భారీ వర్షాల కారణంగా పలు విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
7 గంటల పాటు పడిగాపులు
ప్రధానంగా ఇతర దేశాల నుంచి చెన్నైకి రావాల్సిన విమానాలు ఇతర ప్రాంతాలకు దారి మళ్లించారు. కొన్ని విమానాలు బెంగళూరుకు వెళ్లాయి. మరికొన్ని విమనాలు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాయి. ఇళయ రాజా వెళ్లాల్సిన దుబాయ్ విమానం సైతం చాలా ఆలస్యంగా చెన్నైకి వచ్చింది. వచ్చినా.. వెంటనే వెళ్లలేదు. రన్ వే అంతా నీటితో నిండిపోయింది. విమానం మూడు గంటల పాటు కదలదని అధికారులు చెప్పారు. తీరా బయల్దేరే సమయంలో మరో సమస్య వచ్చింది. ఆకాశం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. మరో రెండు గంటల పాటు విమానం ఆగిపోయింది. మొత్తంగా ఏడు గంటల పాటు చెన్నై ఎయిర్ పోర్టులో ఇళయ రాజా వెయిట్ చేయాల్సి వచ్చింది.
బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం
ప్రకృతి కోపం మూలంగా ఇప్పుడు ఇళయ రాజా ప్రయాణం ఆలస్యం అయినా.. గతంలో బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆయనకు అవమానం జరిగింది. మంగుళూరులోని కొన్ని ఆలయాలను సందర్శించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అన్ని ఆలయాలను దర్శించుకున్నారు. తిరిగి వచ్చే సమయంలో బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు ఇళయరాజాను, ఆయన బ్యాగును స్కానర్ చెకింగ్ దగ్గర నిలిపేశారు. ఆయన బ్యాగులో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ పూర్తిగా తనిఖీ చేశారు. ఆయన బ్యాగును సైతం ఓపెన్ చేయించారు. అందులో కొబ్బరి ప్రసాదం ఉన్నది. తన తండ్రికి జరిగిన అవమానంపై ఆయన కొడుకు కార్తీక్ రాజా సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగాడు. తన ఫోన్ తో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఫోటోలు తీశాడు. దీంతో వివాదం పెద్దదయ్యింది. ఆ ఫోటోలను డెలీట్ చేసే వరకు సెక్యూరిటీ సిబ్బంది ఊరుకోలేదు. ఇంతలో అక్కడే ఉన్న ఓ జర్నలిస్టు.. ఇళయ రాజా గురించి చెప్పడంతో గొడవ ఆగిపోయింది. ఆ తర్వాత అక్కడ జరిగిన వివాదానికి చింతిస్తున్నట్లు సెక్యూరిటీ అధికారులు చెప్పారు. అనంతరం ఆయను విమానం దగ్గరికి తీసుకెళ్లారు. ఇళయ రాజా కుటుంబం విమానంలో చెన్నైకి బయల్దేరింది.