టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు.  'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత వీళ్ళిద్దరూ ‘SSMB 28’ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా, ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ షురూ అయ్యింది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మహేష్ బాబుతో పాటు హీరోయిన్లు కూడా ఈ షూట్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రలపై ముఖ్యమైన సన్ని వేశాలను  తెరకెక్కించనున్నారు.


శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్


సంక్రాంతి తర్వాత ‘SSMB 28’ సెట్స్ మీదకు వచ్చింది. అప్పటి నుంచి నిరవధికంగా షూట్ చేస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్ గతంలోనే వెల్లడించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ', 'అలా వైకుంఠపురములో' సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రమిది. ఇందులో మరో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు.  థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌


మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది. మహేష్ బాబుతో పాటు, త్రివిక్రమ్‌కు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ 80 కోట్ల రూపాయలు పలికినట్లు తెలుస్తోంది.  


విడుదలపై నో క్లారిటీ!


ఆగస్టు 11న ‘SSMB 28’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఆ తేదీకి కాకుండా అక్టోబర్ 18న విడుదల చేయాలని భావిస్తున్నారట! ఈ ఏడాది అక్టోబర్ 15న నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ వరకు కొనసాగుతాయి. సినిమాను 18న (బుధవారం) విడుదల చేస్తే... 24 వరకు హాలిడేస్ ఉంటాయి. లాంగ్ వీకెండ్ & ఫెస్టివల్ సీజన్ కింద లెక్క. దాన్ని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా వేశారని, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా టైమ్ బాగా ఉంటుందని యూనిట్ భావిస్తోందట. త్వరలో రిలీజ్ పై నిర్మాతల నుంచి క్లారిటీ రానుంది.  






Read Also: విడాకుల తర్వాత తొలిసారి సామ్ ఫోటో షేర్ చేసిన చైతన్య, సమంత మాత్రం?