నోకియా గత 60 ఏళ్లలోనే తొలిసారిగా తన లోగోను మార్చింది. కొత్త లోగోతో మార్కెట్లోకి మళ్లీ బలమైన అరంగేట్రం చేయాలని యోచిస్తున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. నోకియా కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్‌లు ఉన్నాయి, అవి కలిసి NOKIA అనే పదాన్ని రూపొందిస్తున్నాయి. ఈ సారి లోగో రంగుల పరంగా మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకుముందు ఇది నీలం రంగులో మాత్రమే ఉండేది, కానీ కొత్త లోగో చాలా ఆకర్షణీయంగా కనిపించేలా అనేక రంగులతో రూపొందించారు.
నోకియా నుంచి ఇటీవలే కొత్త ఫోన్
నోకియా ఇటీవలే Nokia G22 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ వెనుక కవర్ 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. నోకియా G22 బ్యాటరీ, డిస్‌ప్లే, ఛార్జింగ్ పోర్ట్‌ను కస్టమర్‌లు ఇంట్లోనే మార్చుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్‌తో పాటు iFixit అనే కిట్‌ను కంపెనీ వినియోగదారులకు ఉచితంగా అందజేస్తోంది. ఈ కిట్ ద్వారా, వినియోగదారుడు స్మార్ట్‌ఫోన్‌లోని ఏదైనా భాగాన్ని చాలా సులభంగా మార్చవచ్చు.
Nokia G22లో మీరు 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 90hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఫోన్ 4GB ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది, దీని ధర సుమారు రూ.15,500. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీ కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. మొబైల్ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 20W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.