సినీ పరిశ్రమలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వేల పాటలు పాడిన ఈ మధుర గాయకుడిని కోల్పోవడం మన దురదృష్టకరం. ఎస్పీబీను తలచుకుంటే ఇప్పటికీ అభిమానులకు కన్నీళ్లు ఆగవు. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు సినీ సంగీతానికి పునాది వేస్తే.. ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది మాత్రం ఎస్పీ బాలు అనే చెప్పాలి. దశాబ్దాల పాటు తన గానంతో మైమరిపించిన ఆయన గతేడాది సెప్టెంబర్ 25న కరోనా మహమ్మారితో పోరాడి తనువు చాలించారు. ఆయన మరణించి అప్పుడే ఏడాది అయిపోయింది. బాలు మొదటి వర్ధంతిని పురస్కరించుకొని.. ఆయన జీవితంలో కొన్ని మరపురాని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం': గాయకుడిగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి బాలు వద్ద మేనేజర్ గా పనిచేశారు విట్టల్. అతడితో బాలు ఎంతో స్నేహంగా ఉండేవారు. సందర్భం వచ్చిన ప్రతీసారి విట్టల్ గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు ఎస్పీబీ. ఓ ఇంటర్వ్యూలో బాలు అంటే విట్టల్.. విట్టల్ అంటే బాలు అంటూ గర్వంగా చెప్పారు ఎస్పీబీ. దీన్ని బట్టి ఆయన స్నేహానికి ఎంత విలువిస్తారో అర్ధం చేసుకోవచ్చు.
చక్రవర్తి, మహదేవన్ అలానే పిలిచేవారు: ఎస్పీబీ పూర్తి పేరు.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఇండస్ట్రీలో అందరూ ఆయన్ను బాలు అనే పిలిచేవారు. అయితే ఆయన ఇంట్లో మాత్రం మణి అని పిలిచేవారట. బంధువర్గం, స్నేహితులంతా కూడా మణి అనే పిలిచేవారట. ప్లేబ్యాక్ సింగర్ అయిన తరువాత ఇండస్ట్రీలో చక్రవర్తి గారు, మహదేవన్ గారు మణి అని పిలిచేవారట.
ఆ లెజండ్స్ బాలు బంధువులే.. : ఎస్పీబీకి ఇండస్ట్రీలో బంధువులు ఉన్నారట. ఎస్పీ కోదండ పాణి, కె విశ్వనాథ్, చంద్రమోహన్ వంటి వారు తనకు బంధువులు అవుతారని గతంలో ఓసారి బాలు అన్నారు. చంద్రమోహన్ మొదటి సినిమాకి పాడలేకపోయానని.. ఆ తరువాత చాలా పాటలు పాడానని చెప్పేవారు. బంధుత్వం కంటే స్నేహానికే ఎక్కువ విలువ ఇస్తారు బాలు.
Watch Video: మీ పాట శాశ్వతం.. మీ మాట శాశ్వతం.. ఇదే మా నీరాజనం
కూతురికిచ్చిన మాట కోసం.. : బాలు గారిని స్మోకింగ్ అలవాటు ఉండేదట. చాలా ఏళ్ల పాటు ఆ అలవాటుని వదలలేకపోయారు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చిన తరువాత కూడా ఆయన పొగ తాగేవారు. దానికి బానిస అయిపోయానని ఓ సందర్భంలో బాలు అన్నారు. అయితే తన కూతురు కారణంగా స్మోకింగ్ మానేశారు బాలు. ఒకరోజు తన కూతురు 'ఈ ఒక్క విషయంలో నా మాట విని స్మోకింగ్ మానేయండి నాన్నా' అని అడిగారట. అప్పటినుండి బాలు స్మోకింగ్ జోలికి వెళ్లలేదు.
Also Read: పాటల తోటమాలి మనల్ని వదిలి నేటికి ఏడాది.. నీ పాట మిగిలే ఉంది.. మిగిలే ఉంటుంది
పాటలకు దూరమవుతానని తెలిసినా..: కొన్నేళ్ల క్రితం ఎస్పీబీకి వోకల్ కార్డ్స్ కి సంబంధించి గొంతులో ఓ సమస్య వచ్చింది. ఆ సమయంలో పాటలు పాడలేకపోయారు. స్పెషలిస్ట్ ను సంప్రదిస్తే సర్జరీ చేయాలని చెప్పారట. అయితే సర్జరీ చేసిన తరువాత వాయిస్ మార్పు వచ్చే అవకాశం ఉందని.. పూర్తిగా పాటలకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడొచ్చని చెప్పారట. ఆ సమయంలో లతా మంగేష్కర్.. ఎస్పీబీకి ఫోన్ చేసి సర్జరీ వద్దని.. మెడికేషన్ తో మేనేజ్ చేయమని సలహా ఇచ్చారట. కానీ ఎస్పీబీ రిస్క్ చేసి సర్జరీ చేయించుకున్నారు. దేవుడి దయవల్ల ఆయనకి ఏం కాలేదని.. ఆపరేషన్ జరిగిన నాల్గో రోజు నుంచే పాడడం మొదలుపెట్టానని ఓసారి ఎస్పీబీ స్వయంగా చెప్పారు.
Also Read: మా అమ్మాయి తెలుగు సినిమాలు చేయదు.. ఆమెతో పనిచేయడం ఇబ్బందే: మహేష్ బాబు
Watch Video: మోనార్క్ Vs మంచు ముత్యం.. ‘మా’ ఎన్నికల్లో ఎవరితో ఎవరు ‘ఢీ’?