‘సీతా రామం’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పుడు అంచనాలు మరింత మించిపోయాయి. ‘సీతా రామం’ టీజర్ చూడగానే.. ఇదే అందమైన ప్రేమ కథ కావచ్చనే అభిప్రాయం కలిగింది. కానీ, ‘సీతా రామం’ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు మారిపోయాయి. కేవలం ప్రేమ కథ మాత్రమే కాదని, అంతకు మించి ఏదో కథలో ఉందనేది స్పష్టమవుతోంది. మరి ట్రైలర్‌లో ఏముంది? లేఖలో ఒక్కటై.. ప్రేమికులుగా మారిన ఆ జంట ఎందుకు ఎలా విడిపోయారు? 20 ఏళ్ల కిందట రామ్ రాసిన ఆ లేఖలో ఏమైంది? రామ్ ఏమయ్యాడు? ఇలా ఎన్నో సందేహాలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత కలుగుతుంది. 


1965 నాటి సీతా-రామ్‌ల ప్రేమ కథలో విలన్ ఎవరు?:


1965లో కశ్మీర్‌లో పహారా కాస్తున్న ఓ సైనికుడు రామ్ (దుల్కర్ సల్మాన్). అనాథ కావడం వల్ల అతడికి ఎవరి నుంచి ఉత్తరాలు రావు. కానీ, ఒక రోజు సీతా అనే యువతి నుంచి రామ్‌కు లేఖ వస్తుంది. నేను నీ భార్యను అంటూ పరిచయం చేసుకుంటుంది. అలా మొదలైన కలం స్నేహం.. వారిద్దరినీ కలుపుతుంది. ముందు విడుదలైన టీజర్ ప్రకారం.. అదే కథ అనుకుంటాం. కానీ, ట్రైలర్ చూసిన తర్వాత ఊహించిన ట్విస్టులను చూస్తాం. వారి ప్రేమ కథలో విలన్ ఉన్నాడని తెలుస్తుంది. అది బ్రిగేడియర్ విష్ణు శర్మ(సుమంత్) అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అంటే సుమంత్ ఫస్ట్ టైమ్ నెగటీవ్ రోల్‌లో కనిపించనున్నారా? అతడు రామ్ గురించి తెలియగానే అంత కంగారు పడటం వెనుక మరో కారణం ఏమైనా ఉందా? 


సీత కోసం అఫ్రీన్ అన్వేషణ:



సీత మహాలక్ష్మి కోసం 20 ఏళ్ల కిందట రామ్ రాసిన లేఖను అందించే బాధ్యతను అఫ్రీన్(రష్మీక మందన్నా) తీసుకుంటుంది. ఆమెకు బాలాజీ (తరుణ్ భాస్కర్) సహకరిస్తాడు. ఆమె ఆచూకీ కోసం అఫ్రీన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ, ఫలితం ఉండదు. ‘‘సీతను ఎలా పట్టుకోవాలి? నాకు ఇంకా 10 రోజులై టైమ్ ఉంది? రామ్ గురించి తెలిస్తే.. సీత ఆచూకీ తెలుసుకోవచ్చు’’ అంటూ అఫ్రీన్.. రామ్ వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. రామ్ 1965లో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేస్తున్నాడని తెలుసుకుంటుంది. 


ఇదీ రామ్, సీత కథ:



సీత రాసిన ఉత్తరాలు రామ్‌ను ప్రేమలో పడేస్తాయి. తాను ఇక అనాథను కాదని, తన కోసం ఒకరు ఉన్నారనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు నేరుగా సీతను కలుసుకుంటాడు. ఈ సందర్భంగా వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ‘‘నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే. కశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తావా?’’ అని సీత అంటుంది. ‘‘నా పాటికి నేను అనాథలా బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టింది కాక.. దారి ఖర్చులు ఇస్తామనడం న్యాయమా?’’ అని దుల్కర్ అంటాడు. ‘‘ఏమే సీత’’ అంటూ రామ్ పిలవడం.. ఆమె కోపంతో వెనక్కి తిరిగి చూసే సీన్.. బాగుంటుంది. ఈ సీన్స్ బట్టి.. రామ్, సీత ఎంత క్లోజ్‌గా ఉంటారనేది అర్థమవుతుంది. 


బ్రిగేడియర్ విష్ణు శర్మకు రామ్‌ మధ్య వైరం?:


రామ్‌ను కనుగొనే ప్రయత్నంలో అఫ్రీన్.. బ్రిగేడియర్ విష్ణు శర్మ వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంది. రామ్‌ కోసం తెలుసుకోవడం కోసం అఫ్రీన్ తన గురించి వెతకడం తెలిసి విష్ణు శర్మ కంగారు పడటాన్ని ట్రైలర్‌లో చూపించారు. అలాగే అఫ్రీన్.. కేవలం తాను రామ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రాలేదని, తన సమస్యను పరిష్కరించుకోడానికి వచ్చానని బాలాజీతో చెబుతుంది. ఇంతకీ అఫ్రీన్‌కు ఆ బాధ్యత అప్పగించింది ఎవరు? అతడికి 20 ఏళ్ల కిందట రామ్ ఇచ్చిన ఉత్తరం ఎలా అందింది? ఇందులో మేజర్ సెల్వన్(గౌతమ్ వాసుదేవ మీనన్) పాత్ర ఏమిటనేది ట్రైలర్‌లో చూపించలేదు. అయితే, ఇందులో రష్మీక, తరుణ్ భాస్కర్ల పాత్రలు ‘మహానటి’ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ పాత్రలను పోలి ఉంటుంది. అయితే, ఇది జస్ట్ పోలిక మాత్రమే. అసలు కథ ఏమిటనేది వెండితెరపై చూస్తేనే బాగుంటుంది. 




Also Read: ‘సీతా రామం’ ట్రైలర్: 20 ఏళ్ల నాటి ఆ లేఖ సీతకు అందిందా?