దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ ‘సీతారామం’ సినిమాను నిర్మించారు.


ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది. కొద్ది రోజుల కిందట విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మాంచి ఫీల్ గుడ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చేస్తుందనే ‘సీతా రామం’ చిత్రయూనిట్ అంటోంది. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఓ ఒంటరి సైనికుడికి.. ఓ యువతికి మధ్య నడిచే 1965 నాటి ప్రేమ కథ. ఇద్దరు అపరిచితుల మధ్య ఉత్తరాలతో ఏర్పడే స్నేహం.. ఎటువైపు వెళ్తుందనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. 


‘సీతా రామం’ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. రష్మికా మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సోమవారం చిత్రయూనిట్ ‘సీతా రామం’ ట్రైలర్‌ను విడుదల చేసింది. 


ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. 20 ఏళ్ల కిందట రామ్(దుల్కర్) రాసిన ఉత్తరాన్ని సీత(మృణాల్)కు చేర్చే బాధ్యతను రష్మిక తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెను కలుసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఆమెకు సహాయం అందించే పాత్రలో దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ కనిపించారు. ఇంతకీ సీతకు ఆచూకీ తెలిసిందా? రామ్‌కు ఏమైంది? సీతకు రాసిన ఆ లేఖలో ఏముంది అనేది మిగతా కథ. ఈ ట్రైలర్ చూస్తుంటే.. కాస్త ‘మహానటి’ కోణం కనిపిస్తున్నా. మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.


‘సీతా రామం’ ట్రైలర్: