Geetha Madhuri: సింగర్ గీతా మాధురి తన అభిమానులతో సంతోషకరమైన వార్తను పంచుకుంది. మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో భర్త నందు, కూతురు దాక్షాయనితో పాటు గీత కనిపించింది. ఈ పిక్ క్యాప్షన్ లో అసలు విషయాన్ని వెల్లడించింది. దాక్షాయని త్వరలో అక్క కాబోతున్నట్లు రాసుకొచ్చింది. మరోసారి తాను ప్రెగ్నెంట్ అయినట్లు ఇండైరెక్ట్ గా చెప్పింది. వచ్చే ఏడాది (2024) ఫిబ్రవరిలో తను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు, సినీ అభిమానులు గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.    


2014లో పెళ్లి, 2019లో పాప


గీతా మాధురి, నందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, 2014లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ దంపతులకు సుమారు 5 సంవత్సరాల తర్వాత, అంటే 2019 అమ్మాయి పుట్టింది. ఆమెకు దాక్షాయని ప్రకృతి అనే పేరు పెట్టారు. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది గీతా మాధురి.


ఇండస్ట్రీలో రాణిస్తున్న గీత, నందు


గీతా మాధురి తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్‌గా రాణిస్తోంది. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గానూ చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అద్భుత గాత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పలు సినిమాల్లో పాడిన పాటలకు గాను బెస్ట్‌ సింగర్‌ గా అవార్డులను అందుకుంది. కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. గీతా మాధురి భర్త నందు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. గత కొద్ది కాలంగా యాంకర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా కనిపిస్తున్నారు. మరోవైపు పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. మొత్తంగా భార్యాభర్తలు సినీ ఇండస్ట్రీలో తమ ప్రతిభ చాటుకుంటున్నారు.


గీత మాధురి, నందు విడిపోతున్నారంటూ ఊహాగానాలు


ఇక కొద్ది రోజుల క్రితం గీతా మాధురి, నందు దంపతుల గురించి పలు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు విడిపోతున్నారంటూ కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాశాయి. అయితే, ఈ వార్తలు వాస్తవం కాదని గీతా మాధురి వెల్లడించింది. అవన్నీ పుకార్లు మాత్రమేనని తేల్చి చెప్పింది. ఇలాంటి వార్తలు చూసి నవ్వు వస్తున్నట్లు నందు వెల్లడించాడు. అయితే, కొన్నిసార్లు బాధ కూడా కలుగుతుందని చెప్పుకొచ్చాడు. అటు రెండో బిడ్డ రాబోతున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.    






Read Also: మోడీకి వెంకీ మామ టిప్స్ - ‘సైంధవ్’ లిరికల్ సాంగ్ అదుర్స్