Telangana IPS Transfers CM Revanth Reddy  :  తెలంగాణ పోలీస్‌ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీలకమైన హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీగా అవినాశ్‌ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్‌బాబును నియమించింది. హైదరాబాద్‌ పాత సీపీ సందీప్‌ శాండిల్యను నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఇప్పటి వరకూ సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ సీపీగా ఉన్న  దేవేంద్ర సింగ్ చౌహాన్‌లను డీజీపీ ఆఫీస్‌కు ఎటాచ్ చేశారు. నిజానికి హైదరాబాద్ సీపీగా ఉన్న  సీవీ ఆనంద్‌ను ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యాక ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో సందీప్ శాండిల్యను నియమించారు. ఇప్పుడు ఆయనకు నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ గా బదిలీ ఆదేశాలు అందాయి. సీఎం రేవంత్ రెడ్డి..   డ్రగ్స్ విషయంలో పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు తీసుకోవాలనుకుంటున్నందున సందీప్ శాండిల్యకు కీలకమైన బాధ్యతలే వచ్చాయని భావిస్తున్నారు.


ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసుకుంటారు. గత ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో ఉన్న వారిని లూప్ లైన్ కు పంపి.. అప్పటి వరకూ లూప్ లైన్ లో ఉన్న వారికి ప్రాధాన్య పోస్టులు ఇస్తూంటారు. ఎందుకంటే.. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నా... అప్పటి వరకూ ప్రభుత్వంలో ఉన్న వారికి సన్నిహితులని భావిస్తారు. అంతే కాదు ఎన్నికల సమయంలోనూ వారే విధులు నిర్వహించి ఉంటారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని  గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయనను సైబారాబాద్ కమిషనర్ నుంచి తప్పించి.. డీజీపీ ఆఫీస్‌కు ఎటాచ్ చేశారు. ఆయనకు ఏదైనా ప్రాధాన్యమైన పోస్టింగ్ లభిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 


ఐఏఎస్ అధికారులను కూడా భారీగా బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు చేస్తున్నారు. తొలి రోజు విద్యుత్ పై చేశారు. ఆ తర్వాత ఆర్థిక శాఖపై.. ఇలా వరుసగా చేస్తూ పోతున్నారు. సోమవారం డ్రగ్స్ నియంత్రణపైనా చేశారు. ఆయన దూకుడుగా పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.  కానీ తాను చేసే సమీక్షలు.. చేయాలనుకుంటున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే  ఆఫీసే సీఎంవో. ఆ సీఎంవో క్రియాశీలకంగా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై యుద్ధప్రాతిపదికన పర్యవేక్షణ చేయవచ్చు. ఈ విషయాన్ని సీఎం గుర్తించడం లేదా అన్నది అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికీ సీఎంవోలో కానీ.. పోలీసు వర్గాల్లో కానీ  బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులే కీలక పదవుల్లో ఉన్నారని చర్చ జరుగుతోంది. హోంశాఖను కూడా తన వద్దనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఆ శాఖ ప్రక్షాళన విషయంలో  దూకుడుగా వ్యవహరించడం లేదని భావిస్తున్నారు. 


అయితే అన్నీ ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి బదిలీలు చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారన్న ఒక్క కారణంగానే బదిలీ లు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారులు చెబుతున్నారు.