Telangana Government News: ప్రజాపాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Governement ) ముందుకు సాగుతోంది. రోజురోజుకో సరికొత్త కార్యక్రమాల్లో పాలన సాగిస్తూ.. ప్రజలకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటి వరకు చేపట్టిన ప్రజాదర్బార్ (Prajadarbar)ను ప్రజావాణి ( Prajavani)గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా మార్చింది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 10 లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి వినతులు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రజా భవన్ (Praja Bhavan ) లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. దీంతో ఈ కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించింది.
4,471 దరఖాస్తులు స్వీకరణ
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో.. ఈ నెల 8న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ( Chief Minister )రేవంత్‌రెడ్( Revanth reddy)డి ప్రారంభించారు. ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజాభవన్‌కు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి సోమవారం వరకు మొత్తం 4,471 వరకు వినతులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో ఎక్కువ శాతం ధరణితో తలెత్తిన భూసమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతులే ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందాయని అధికారులు పేర్కొన్నారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాలనలో తన మార్కును చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు వరుస సమీక్షలు నిర్వహిస్తూనే...మరోవైపు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
ప్రత్యేకత చాటుకుంటున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సమీక్షలు, సమావేశాలతో ఫలు బిజీగా ఉంటూనే, ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలు జారి పడ్డారు. దీంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా ఓ మహిళ...రేవంత్ అన్న రేవంత్ అన్న అని పిలిచి మీతో మాట్లాడాలని కోరింది. దీంతో అది విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...ఆమె దగ్గరకు వెళ్లి మరీ తన సమస్యను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్య ఏమిటో చెప్పాలని అడిగారు. తన పాప ఆస్పత్రికి సంబంధించిన ఖర్చు చాలా అవుతుందని, కొంచెం సాయం చేయాలని కోరింది. దీంతో వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి ఆ మహిళ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.