Shraddha Kapoor Instagram Followers: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ ను వెనక్కి నెట్టి మరీ అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకుంటోంది. ఇండియాలో అత్యధిక ఇన్ స్టా ఫాలోవర్స్ ను కలిగిన టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(265M), హాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా(90M) తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం 85.3 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా కపూర్, సోషల్ మీడియాలో తిరుగులేదని నిరూపించుకుంటోంది.


నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు


సినీ అభిమానులకు శ్రద్ధా కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన ‘సాహో’ సినిమాలో హీరోయిన్ గా నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆన్ స్క్రీన్‌ పై అద్భుతమైన నటనతో  ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. చూడ్డానికి అచ్చం పక్కింటి అమ్మాయి మాదిరిగానే కనిపిస్తుంది. నటనలో సహజత్వాన్ని కలబోస్తూ ఆకట్టుకుటుంది. ఇన్‌స్టా ఫాలోవర్లలో ప్రభాస్‌ (10.8 మిలియన్)ను సైతం మించిపోయింది. అలాగే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (45.3 మిలియన్) కంటే రెట్టింపు ఫాలోవర్లతో ఔరా అనిపిస్తోంది.


సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి..


శ్రద్ధా కపూర్ మంచి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్, శివంగి కపూర్ ముద్దుల కూతురు. ఆమెకు సిద్ధాంత్ కపూర్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. శ్రద్ధా కపూర్ ఇద్దరు అత్తలు పద్మిని కొల్హాపురే, తేజస్విని కొల్హాపురే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటులుగా గుర్తింపు పొందారు. సుప్రసిద్ధ గాయకులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్‌లకు ఆమె స్వయంగా మేనకోడలు కావడం విశేషం.


శ్రద్ధా కపూర్ ముంబైలోనే పుట్టి పెరిగింది. 2010లో ఆమె వెండితెరకు పరిచయం అయ్యింది. అమితాబ్ బచ్చన్, ఆర్ మాధవన్ తో కలిసి ‘తీన్ పట్టి’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. 2013లో ఆమె నటించిన రొమాంటిక్ మ్యూజిక్ ‘ఆషికి 2’ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ‘తు ఝూతి మైన్ మక్కార్’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం వసూళ్లపరంగా సత్తా చాటింది. 


శ్రద్ధాకపూర్ తర్వాత ప్లేస్ లో ఎవరంటే?


అటు శ్రద్ధా కపూర్‌తో పాటు పలువరు బాలీవుడ్ స్టార్ ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. క్యూట్ బ్యూటీ ఆలియా భట్ 81.8 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది. కత్రినా కైఫ్ కి 79.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీపికా పదుకొనెను 78 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా, నేహా కక్కర్ సైతం 76 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది.






Read Also: హాలీవుడ్‌కు షాకిచ్చిన ‘సలార్’, ‘డంకీ’ - గ్లోబల్ బాక్సాఫీస్‌ బాక్స్ బద్దలు