ప్రస్తుతం థియేటర్లలో పలు పాన్ ఇండియా, బ్లాక్‌బస్టర్ చిత్రాలు రన్ అవుతున్నా.. చాలామంది ప్రేక్షకులు ఇంకా ‘యానిమల్’ ఇచ్చిన ఎఫెక్ట్ నుంచి బయటికి రాలేదు. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరి నటన ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంది. అలా ఈ మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది తృప్తి దిమ్రీ. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోని చాలామంది మేకర్స్ దృష్టి కూడా తృప్తిపైనే ఉంది. తనకు ఆఫర్లు ఇవ్వడానికి మేకర్స్ క్యూ కడుతున్నారు. కానీ తృప్తి మాత్రం ఇప్పటివరకు తన అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్‌ను రివీల్ చేయలేదు. తాజాగా తను ఒక బడా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.


చాలామందికి క్రష్


హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి పలు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన తృప్తి దిమ్రీ. వాటిలో తన నటన బాగుందని చూసిన ప్రేక్షకులు ప్రశంసించినా.. వాటి వల్ల తనకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ‘యానిమల్’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తన పాత్ర నిడివి కాసేపే అయినా.. అందరికీ గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది. చాలామందికి క్రష్‌గా మారిపోయింది. దీంతో తన తరువాతి ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విక్కీ కౌశల్‌తో ఒక మూవీ చేస్తున్న తృప్తికి మరో యంగ్ హీరోతో జోడీకట్టే అవకాశం వచ్చిందని బాలీవుడ్‌లో వార్తలు మొదలయ్యాయి.


కార్తిక్ ఆర్యన్‌తో కెమిస్ట్రీ


కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ‘ఆషిఖీ 3’లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసిందట తృప్తి. ఇప్పటికే ‘ఆషిఖీ 2’ చిత్రం బాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్రేజీ ఫ్రాంచైజ్‌లో తృప్తి భాగమవుతున్నందుకు తన ఫ్యాన్స్ తెగ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే రణబీర్‌ కపూర్‌లాంటి సీనియర్ హీరోతోనే తృప్తి కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉందంటే.. ఇక కార్తిక్ ఆర్యన్‌లాంటి యంగ్ హీరోతో ఇంకా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’లో కూడా తృప్తి కీలక పాత్ర పోషిస్తుందని రూమర్స్ వచ్చినా.. అవన్నీ రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేసింది.


‘ఆషిఖీ 3’తో పాటు


‘ఆషిఖీ 2’ను అందంగా తీర్చిదిద్దిన మోహిత్ సూరీకి కాకుండా ‘ఆషిఖీ 3’ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అనురాగ్ బసుకు వెళ్లింది. ‘బర్ఫీ’, ‘లూడో’లాంటి ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కించిన అనురాగ్.. ‘ఆషిఖీ 3’లాంటి రొమాంటిక్ చిత్రాన్ని ఎలా డైరెక్ట్ చేస్తాడా అని బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భూషణ్ కుమార్, టీ సిరీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ‘ఆషిఖీ 3’తో పాటు విక్కీ కౌశల్‌తో మరో సినిమాలో నటిస్తోంది తృప్తి. ‘మేరే మోహబూబ్ మేరే సనమ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఇప్పటికే పలు ఫోటోలు లీక్ అవ్వగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Read: హ్యపీ బర్త్ డే సల్లూ భాయ్: సల్మాన్ ఖాన్‌కు అరుదైన వ్యాధి - రోజుకు 35 రోటీలు, బాత్రూమ్‌లో అవి ఉండాల్సిందేనట!