బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘జవాన్’. చాలా కాలం తర్వాత ‘పఠాన్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న షారుఖ్ ఖాన్, అదే జోష్ లో ‘జవాన్’తో మరో హిట్ అందుకోవాలని భావిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కూడా క్యామియో రోల్ లో మెరవనున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్, నయనతార, అట్లీ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.
‘జవాన్’ విడుదల వాయిదాకు కారణం ఏంటంటే?
షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా రిలీజ్ సుమారు రెండు నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. దానికి కారణం ఈ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి VFX వర్క్ పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా తప్పని సరి అయ్యిందట. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే అంశంపై క్లారిటీ రాలేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఆగష్టులో ఈ సినిమా విడుదల ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
‘జవాన్’ సినిమా వీడియో క్లిప్స్ లీక్
రీసెంట్ గా ‘జవాన్’ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. వీటిలో ఒక వీడియోలో షారూఖ్ ఖాన్ ఫైట్ సీన్లు చేస్తున్నట్లు ఉండగా, మరో వీడియోలో నయనతారతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్నది. ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశంపై షారుఖ్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘జవాన్’ మూవీకి సంబంధించి కంటెంట్ ను వెబ్‌సైట్‌లు, కేబుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లు, డైరెక్ట్ టు హోమ్ సర్వీస్‌లతో సహా ఎలాంటి స్ట్రీమిండ్ ప్లాట్‌ఫారమ్ లు ప్రసారం చేయకూడదని ఆదేశించింది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన వైరల్ వీడియో క్లిప్‌లను తొలగించాలని యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, రెడ్డిట్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోర్టు ఆదేశించింది.
Read Also: కర్నాటకలో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం, ప్రాణ స్నేహితుడి గెలుపు కోసం కష్టపడుతున్న కామెడీ బ్రహ్మ!