Gutka Advertisements: బాలీవుడ్ స్టార్స్ కు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంటుంది. వారు చేసే ప్రతి పనిని ప్రేక్షకులు గమనిస్తుంటారు. వారు చెప్పే మాటలను కొందరు అభిమానులు తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే, ఒక్కోసారి సదరు సినీ తారు చేసే తప్పుడు ప్రచారం కారణంగా ఎంతో మంది అమాయకులు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నది అలహాబాద్ హైకోర్టు. ఏకంగా ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది.
పాన్ మసాల యాడ్ లో బాలీవుడ్ స్టార్స్
అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు గత కొంత కాలంగా ఓ గుట్కా బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు. వీరు కలిసి నటించిన పాన్ మసాల యాడ్స్ టీవీల్లో, సినిమా థియేటర్లలో, సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. ఈ యాడ్ చూసి చాలా మంది అమాయకులు గుట్కాకు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుట్కా యాడ్స్ లో నటిస్తున్న సినీ తారలతో పాటు ప్రముఖలపై చర్చలు తీసుకోవాలని చాలా మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ కేసుల నేపథ్యంలో కొంత మంది హీరోలు ఈ యాడ్స్ నుంచి తప్పుకున్నారు. మరికొంత మంది మాత్రం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
కోర్టును ఆశ్రయించిన మోతీలాల్ యాదవ్
విమల్ గుట్కా యాడ్ లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోలపై చర్యలు తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది అలహాబాద్ హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న నటులు ఈ యాడ్స్ లో నటించడం సరికాదని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో మోతీలాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై సీరియస్ అయిన న్యాయస్థానం వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
అలహాబాద్ హైకోర్టు నోటీసులతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌కు అక్టోబర్ 22నే నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈ గుట్కా యాడ్ లో అమితాబ్ బచ్చన్ కూడా నటించినట్లు వివరించారు. ఆయన తన కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ సదరు గుట్కా సంస్థ మాత్రం ఇంకా బిగ్ బీ యాడ్ ను టెలీకాస్ట్ చేయిస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో అమితాబ్ సదరు కంపెనీకి లీగల్ నోటీసు కూడా పంపినట్లు వివరించారు. ఈ కేసుపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.
Read Also: హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో - ప్రతి ఏడాదీ 10 రోజులు ఇలా న్యూడ్‌గా