మిర్యాలగూడలో అమృత - ప్రణయ్ ప్రేమకథ ఓ సంచనలం. ప్రణయ్ హత్య తర్వాత జరిగిన అమృత తండ్రి మారుతి జైలుకు వెళ్లారు. అప్పట్లో కొందరు కుమార్తెకు, కొందరు తండ్రికి మద్దతు పలికారు. 'క్రాక్'లో విలన్ (సముద్రఖని) కుమార్తె ప్రేమకథ, పెళ్లి ఎపిసోడ్‌కు అదే స్ఫూర్తి. 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సినిమాలో బాలాదిత్య, అర్చన ఎపిసోడ్‌కు అమృత - ప్రణయ్ ప్రేమకథే స్ఫూర్తి. అయితే... ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో సినిమా రాలేదని చెప్పాలి. 'దిల్' రాజు నిర్మాణ సంస్థలో దర్శకత్వ శాఖలో పని చేసిన సతీష్ పరమవేద సీరియస్‌గా సినిమా చేస్తున్నారు.
సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. ఇందులో అమృత - ప్రణయ్ ప్రేమకథ, అమృత తండ్రి మారుతీరావు సమస్యను మేళవించి ఫిక్షనల్ స్టోరీ రాశానని దర్శకుడు తెలిపారు. సతీష్ పరమవేద మాట్లాడుతూ "అందరూ రామాయణం వినే ఉంటారు. సీతను రావణాసురుడు అపహరిస్తే... అతడితో రాముడు యుద్ధం చేసి, భార్యను వెనక్కి తెచ్చుకున్నాడు. రాముడికి హనుమంతుడు, వాలి, సుగ్రీవులు మద్దతు ఇచ్చారు. ఈ యుద్ధంలో ఎక్కడైనా సీత తండ్రి జనకుడు కనిపించారా?ఆయనేం చేశారు? ఈ పాయింట్ బేస్ చేసుకుని... నల్గొండలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ - అమృత ప్రేమకథ, మారుతి రావు వివాదం మేళవించి ఓ కల్పిత కథ రాశా. ఫామిలీ ఎమోషన్స్‌తో కూడిన వైల్డ్ యాక్షన్ సినిమా ఇది" అని చెప్పారు.
సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న 'సీతా కళ్యాణ వైభోగమే' శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి 'దిల్' రాజు సోదరుని కుమారుడు, నిర్మాత హర్షిత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇచ్చారు. 'నాంది'తో దర్శకుడిగా పరిచయమైన విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మునుగూడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి మామిడి హరికృష్ణ అతిథులుగా హాజరయ్యారు.
"సతీష్‌తో 'ఊరికి ఉత్తరాన' తీశాం. ఆ చిత్రానికి మంచి పేరొచ్చింది. ఇప్పుడీ సినిమా ప్రారంభించాం. ప్రేమ వివాహం తర్వాత అమ్మాయి తండ్రి పడే బాధ, అమ్మాయి కుటుంబం ఎదుర్కొనే ఇబ్బందులు, సవాళ్ల నేపథ్యంలో 'సీతా కళ్యాణ వైభోగమే' ఉంటుంది. మాకు 'దిల్' రాజు గారు పెద్ద దిక్కు. ఆయన ఆశీర్వాదం, మద్దతుతో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి... ప్రొడక్షన్ నంబర్ 1గా ఈ సినిమా చేస్తున్నాం" అని నిర్మాత రాచాల యుగంధర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, హీరో సుమన్, హీరోయిన్ గరీమ చౌహన్, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.