‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కశ్మీరీ పండిట్ల కష్టాలపై తీసిన ఈ సినిమాపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వస్తోంది. దీంతో ఈ చిత్రం పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాాగా బాలీవుడ్ స్క్రీన్ రైటర్, దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు మరోసారి చర్చలకు దారితీసాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా మాట్లాడారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తన వరకూ ‘కాశ్మీరీ ఫైల్స్’ను చెత్త సినిమాగా అభివర్ణించారు. అలా ఎందుకు అన్నారో వివరణ కూడా ఇచ్చారు. వాస్తవానికి పట్టుబడింది కేవలం కశ్మీరీ హిదువులే కాదు, ముస్లింలు కూడా ఉన్నారని అన్నారు. ఎన్నో రకాల ఉచ్చులలో వారు కూడా హింసించబడ్డారని చెప్పారు. కొంతమంది అక్కడ ఇప్పటికీ విధ్వంసాలు సృష్టిస్తూనే ఉన్నారని అన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. దీన్ని మనం ఏదో ఒక పక్షానికి కొమ్ముకాసే విధంగా మాట్లాడటం కంటే మానవత్వ దృష్టి కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పారు. ప్రస్తుతం సయీద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సయీద్ అక్తర్ మీర్జా ‘మోహన్ జోషి హజీర్ హో’, ‘ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యూన్ ఆతా హై’, ‘సలీం లాంగ్డే పే మత్ రో’, ‘నసీమ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ‘నుక్కడ్’, ‘ఇంతేజార్’వంటి ప్రముఖ టీవీ సీరియల్స్‌ కి కూడా దర్శకుడిగా పని చేశారు. చివరిగా 2018లో విడుదలైన ‘కర్మ కేఫ్’ అనే లఘు చిత్రాన్ని రాశారు సయీద్.


ఇక ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు వివాదాలు కొత్తేమీ కాదు. ఇటీవల కూడా ఈ సినిమా పై వివాదాలు జరిగాయి. ఈ మూవీను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ప్రదర్శించినప్పుడు ఇజ్రాయెల్ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ ‘ది కాశ్మీరీ ఫైల్స్’ సినిమాపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. బాలీవుడ్ లో సినీ సెలబ్రెటీల తో పాటు ఇంకా చాలామంది ఆయనపై మండిపడ్డారు. తర్వాత నాదవ్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.


వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా 1980 ల చివరలో 90వ దశకం ప్రారంభంలో జరిగిన కాశ్మీరీ హిందువులు వలసల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో మార్చి 11న థియేటర్లలో విడుదలైంది. ఈ సంవత్సరంలో కమర్షియల్ హిట్ అందుకున్న బాలీవుడ్ చిత్రాలలో ఈ సినిమా ఒకటి.  ఈ మూవీ లో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు నటించారు.



Also Read : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు