జంతువులను కాపాడేందుకు మనం ప్రయత్నిస్తాం. కానీ ఆ జంతువే ఇప్పుడు విద్యార్థులను కాపాడుతుంది. అదేంటి అనుకుంటున్నారా? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే..


జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో గల తాటి పల్లి గ్రామంలో ఒక వింత పరిస్థితి నెలకొంది. కోతుల నుంచి విద్యార్థులను రక్షించడానికి ఒక కొండముచ్చు బాడీ గార్డ్ గా కాపలా ఉండాల్సి వస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కోతుల బెడద తీవ్రంగా ఉంది. స్కూల్ కి వస్తున్న సమయంలోనూ, తరగతులు జరుగుతున్న సమయంలో సైతం కోతుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.దిక్కుతోచని స్కూల్ సిబ్బంది కోతుల బారి నుంచి విద్యార్థులను కాపాడడానికి ఒక కొండముచ్చుని తీసుకొని వచ్చారు. స్కూల్ ఆవరణలోనే ఒక చెట్టుకి కట్టేశారు దీంతో కోతుల బెడద కొంతవరకు తగ్గింది.  
 
వాస్తవానికి మల్యాల మండలంలోనే కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడే ఎక్కువ శాతం కోతులు ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు సైతం వాటికి ఆహార పదార్థాలను ఇస్తుంటారు. రాను రాను కోతులు ఎక్కువగా అయిపోయాయి. దీని ప్రభావం మండలంలోని స్థానిక స్కూళ్లపై కూడా పడింది. తాటిపల్లి గ్రామంలో కూడా ఇదే సమస్య ఉంది. ఇక లాభం లేదని.. ఈ కొండముచ్చు బాడీగార్డ్ ఐడియా వేశారు.


వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్వే..





మరోవైపు గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతున్న నేపథ్యంలో వాటి లెక్కను అంచనా వేసేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు చేపట్టారు. వ్యవసాయ విస్తరణ అధికారు (ఏఈఓ)లు పల్లెల్లో తిరుగుతూ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఏ మేరకు పంటలు ధ్వంసం చేశాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి ? చెట్లు, ఇళ్లు, గుట్టలు, పర్యాటక ప్రాంతం? రోడ్డు వెంట?.. ఇలా ఎక్కడ నివసిస్తున్నాయనే అంశాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. రైతులతో మాట్లాడిన తర్వాత వివరాలను ఆన్ లైన్.. క్రాప్‌ బుకింగ్‌ మాడ్యూల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వానరాలను భయపెట్టేందుకు ప్రజలు నైలాన్‌ వలలు, సోలార్‌ ఫెన్సింగ్, మంకీ గన్, కొండ ముచ్చులు, బొమ్మలు, పులి అరుపు తదితర శబ్ద పరికరాలు వినియోగిస్తున్నారా? అనే వివరాలు కూడా యాప్ లో పొందుపర్చాలి.