సమంత (Samantha) స్టార్‌డమ్‌కు 'యశోద'ను ఉదాహరణగా పేర్కొంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇటు ఇండియాలో, అటు అమెరికాలో సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. అంతే కాదు... సమంత నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ థాంక్స్ నోట్ విడుదల చేశారు.
 
ఇదే నాకు గొప్ప బహుమతి!
''సినిమాకు వస్తున్న స్పందన నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మీరు (ప్రేక్షకులు) చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు  లభించిన గొప్ప బహుమతి'' అని సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.  



నా మనసు గాల్లో తేలుతున్నట్టు ఉంది!
''యశోద' చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది'' అని సమంత చెప్పారు.
 
దర్శక నిర్మాతలకూ థాంక్స్!
'యశోద' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన దర్శక - నిర్మాతలకు, సహ నటీనటులకు కూడా సమంత థాంక్స్ చెప్పారు. ''నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. వాళ్ళకు థాంక్స్.  వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది'' అని సమంత తెలిపారు.


Also Read : 'వండర్ ఉమెన్' రివ్యూ : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా!






'యశోద' సీక్వెల్ ఐడియా రెడీ!
'యశోద' సక్సెస్ మీట్‌ (Yashoda Success Meet) లో సీక్వెల్ ఐడియా రెడీగా ఉన్నట్లు దర్శకులు హరి, హరీష్ వెల్లడించారు. ''యశోద 2'కు విషయంలో మాకు ఓ ఐడియా ఉంది. సెకండ్ పార్ట్ మాత్రమే కాదు... థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా రెడీగా ఉంది'' అని హరి, హరీష్ తెలిపారు. అయితే... సీక్వెల్స్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్ళేది సమంత చేతుల్లో ఉందని, ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పారు. ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆవిడ ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత స్టోరీ నేరేట్ చేస్తామన్నారు. సీక్వెల్ తీయడానికి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా రెడీగా ఉన్నారు. 


'యశోద 2'లో సమంత పోలీస్!
'యశోద'లో సమంత ట్రైనీ పోలీస్ / అండర్ కవర్ కాప్ తరహా రోల్ చేశారు. 'యశోద 2'లో ఆవిడ పోలీస్ అధికారిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. రెండో పోర్టులో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ ఉంటారట. 


ప్రపంచంలో కొత్త క్రైమ్స్ వస్తున్నాయిగా... 
'యశోద' విడుదలైన తర్వాత నుంచి సీక్వెల్ గురించి అందరూ అడుగుతున్నారని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. ''ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా క్రైమ్స్ పుట్టుకొస్తున్నాయి. వాటికి పరిష్కరాలూ ఎవరో ఒకరు తీసుకొస్తారు. 'యశోద' సీక్వెల్ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి'' అని ఆయన తెలిపారు. సమంత ఓకే అంటే సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన మాటలు వింటే అర్థం అవుతోంది. 'యశోద'కు వస్తున్న వసూళ్ల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.