విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులకు సమంత సారీ చెప్పారు. వాళ్ళకు క్షమాపణలు తెలిపారు. ఎందుకు? అంటే... తన వల్ల 'ఖుషి' సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నందుకు! అసలు వివరాల్లోకి వెళితే...
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు జంటగా సమంత రూత్ ప్రభు నటిస్తున్న సినిమా 'ఖుషి' (Kushi Movie). 'మహానటి'లోనూ వాళ్ళిద్దరూ నటించారు. అయితే, అందులో ఎక్కువ సన్నివేశాలు లేవు. సినిమా కూడా కీర్తీ సురేష్ మీద వెళుతుంది. 'ఖుషి' ప్రేమ కథ కావడం... పైగా 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీస్ తీసిన శివ నిర్వాణ దర్శకుడు కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆల్రెడీ కశ్మీర్‌లో ఓ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత సమంత అనారోగ్యం బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ వాయిదా వేశారు.
'ఖుషి'పై సమంత క్లారిటీ
ఇప్పుడు సమంత కోలుకున్నారు. వరుణ్ ధావన్ హీరోగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'సిటాడెల్' షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు అందులో ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ 'ఖుషి' సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. అప్పుడు సమంత ''అతి త్వరలో 'ఖుషి' మళ్ళీ మొదలు అవుతుంది. విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా'' అని రిప్లై ఇచ్చారు.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
సమంత వస్తే షూటింగ్ స్టార్ట్ చేయడానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు సినిమా యూనిట్ మొత్తం సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఓ పుకారు వచ్చింది. దాని సారాంశం ఏంటంటే... మార్చి తొలి వారానికి కూడా 'ఖుషి' సెట్స్‌కు సమంత రాకపోతే మరో సినిమా చేయాలని దర్శకుడు శివ నిర్వాణ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు. ''అతి త్వరలో 'ఖుషి' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ అందంగా ఉండబోతుంది'' అని ఆయన పేర్కొన్నారు. దాంతో పుకార్లకు చెక్ పడింది.
ఈ వేసవిలో 'ఖుషి' వస్తుందా?
'ఖుషి' సినిమాను తొలుత గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎందుకు? అనేది ప్రేక్షకులు అందరికీ తెలుసు. అనుకున్న ప్రకారం చిత్రీకరణ జరగలేదు. సమంతతో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా 'లైగర్' చిత్రీకరణలో గాయాలు కావడంతో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని డిస్కషన్స్ జరిగాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఫిబ్రవరిలో విడుదల అయ్యే ప్రస్తక్తి లేదు. వేసవికి విడుదల కావచ్చని టాక్.
Also Read : ఎవరీ ఆషిక? నందమూరి నయా నాయిక గురించి ఆసక్తికరమైన విషయాలు...
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.