బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 57వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అయితే తమ అభిమాన నటుడికి బర్త్ డే విషెస్ చెబుతామని, ఆయన కనిపిస్తే చాలు అని ముంబైలోని సల్మాన్ ఖాన్ అపార్ట్‌మెంట్ కు వచ్చిన అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ భారీ సంఖ్యలో సల్మాన్ ఇంటికి చేరుకున్నారు. అంతలో సల్మాన్ ఇంటి బాల్కనీలోకి వచ్చి అభిమానులకు చేతులు ఊపుతూ, తన కోసం వచ్చిన ఫ్యాన్స్‌కు ప్రేమగా కృతజ్ఞతలు తెలిపాడు. అయితే నటుడ్ని చూసిన సంతోషంలో గేట్ల వైపు అభిమానులు చొచ్చుకు రావడంతో ముంబై పోలీసులు సల్మాన్ అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. నేడు బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ప్రతి ఏడాది లాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో ముంబైలోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్ మెంటుకు తరలివచ్చారు. తమ అభిమాన నటుడు ఎప్పుడు బయటకు వస్తారా అని గంటల కొద్దీ ఎదురుచూసిన అభిమానులు వాళ్లు. ఆ సమయం రానే వచ్చింది. సల్మాన్ గెలాక్సీ అపార్ట్ మెంట్ బాల్కనీలోకి వచ్చి అభిమానులను చూస్తూ చేతులు ఊపాడు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ థ్యాంక్స్ అని పోస్ట్ చేశారు.
తండ్రి సలీం ఖాన్ సైతం బాల్కనీలోకి వచ్చి ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. సల్మాన్, సలీం ఖాన్ ఫ్యాన్స్‌కు పలకరించి వెళ్తున్న సమయంలో కొందరు అభిమానులు అత్సుత్సాహం ప్రదర్శించారు. సల్మాన్ నివాసం ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ లోపలకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు అభిమానులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీకి పని చెప్పారు. అభిమానులను వారించే అవకాశం లేకపోవడంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో దెబ్బలకు తాళలేక కొందరు ఫ్యాన్స్ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేసిన తరువాత సల్మాన్ ఇంటి వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'టైగర్ 3', 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్', 'కిక్ 2', 'నో ఎంట్రీ' సీక్వెల్ సినిమాల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్‌లో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది.