Guntur Couple Dies in US Snow Storm: అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బాంబ్ సైక్లోన్, శీతలమైన చలి కారణంగా అమెరికాలో కనీసం 60 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అత్యవసర సేవలు కూడా ఇక్కడకు చేరుకోలేకపోతున్నాయని అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో అమెరికా మంచు తుపానులో చిక్కుకుని ఏపీకి చెందిన ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. గత కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న భార్యాభర్తలు విహారయత్రకు వెళ్లడంతో విషాదం చోటుచేసుకుందని ఏపీలో ఉన్న వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.


అమెరికా మంచు తుపానులో చిక్కుకుని క్లిష్ట పరిస్థితుల్లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీ మృతి చెందింది. న్యూజెర్సీలోని ఐస్‌ లేక్‌లో చిక్కుకుని నారాయణ, హరిత అనే దంపతులు మృతిచెందారు. వీరి స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పలపర్రు అని అక్కడి అధికారులు గుర్తించారు. ఇదివరకే హరిత మృతదేహాన్ని లేక్‌ నుంచి సహాయక సిబ్బంది వెలికితీయగా.. నారాయణ మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో హరిత, నారాయణ దంపతులు తమ స్వగ్రామానికి వచ్చి, తిరిగి అమెరికాకు వెళ్లారని సమాచారం. మంచు తుపాను ప్రభావంతో అమెరికా జనాభాలో 60 శాతం మంది (20 కోట్ల ప్రజలు) ప్రభావితం అయ్యారు. దేశంలో నమోదైన మరణాలలో సగానికి పైగా న్యూయార్క్ లో చోటుచేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు. 


పాలపర్రులో విషాదం..
పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు గత కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. అరిజోనాలో జాబ్ చేస్తున్న ఈ దంపతులు విహారయాత్రకు వెళ్లగా విషాదం చోటుచేసుకుంది. ఫినిక్స్ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్తున్నట్లు నారాయణ పాలపర్రులోని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. విహారయాత్రకు వెళ్లిన దంపతులు సరస్సు దాటుతుండగా ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్ మొదట హరితను గుర్తించి బయటకు తీయగా అప్పటికే ఆమె చనిపోంది. నారాయణ కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. భార్యాభర్తలు చనిపోవడంతో గుంటూరు జిల్లాలోని పాలపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దంపతులకు సంతానం ఇద్దరు అమ్మాయిలు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు బాలికలు ఎక్కడ ఉన్నారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.


న్యూయార్క్‌లో మంచు దాదాపు 50 సెంటీ మీటర్లకు పైగా కురుస్తోందని, ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి మైనస్‌ 22-25 డిగ్రీలకు చేరుకున్నాయని గవర్నర్‌ కాథీ హోచుల్‌ తెలిపారు. మంచు తుపానుల కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదని, రవాణకు సైతం అంతరాయం తలెత్తింది. కొన్నిచోట్ల అత్యవసర సహాయక చర్యలు కొనసాగించేందుకు సైతం వీలు కావడం లేదు. క్రిస్మస్ వేడుకలు సరదాగా జరుపుకుంటాం అనుకున్న అమెరికా ప్రజలను కరోనా తరువాత కొత్త సంక్షోభం వెంటాడుతోంది. బాంబ్ సైక్లోన్ వల్ల లక్షలాది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల ఉష్ణోగ్రత -45 డిగ్రీలకు పడిపోయింది.