AP High Court : ఏపీ మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గ్రానైట్‌ తవ్వకాల్లో ఎన్‌వోసీ జారీ అంశంలో విడదల రజినికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలోనే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన మామ ప్రతాప్‌రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా మొరకపూడిలోని 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి విడదల రజిని హస్తం ఉందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు వివరణ ఇవ్వాలని మంత్రి విడదల రజినితో పాటు లోకల్ తహసీల్దార్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. 


మూడు వారాల్లోగా వివరణ 


గ్రానైట్ తవ్వకాల్లో ఎన్వోసీ ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి  ఉంటుందని మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. మంత్రితో పాటు మెరకపూడి తహసీల్దార్‌, సీఐ, ఎస్ఐలకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఈ మూడు వారాల్లోగా మంత్రి విడదల రజిని హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి చట్టవిరుద్ధంగా మైనింగ్‌కు ఎన్వోసీ ఇచ్చారనే ఆరోపణలకు కౌంటర్ దాఖలు చేయాల్సిఉంటుంది.  


చిలకలూరిపేటలో మంత్రి పర్యటన 


పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో మంత్రి విడదల రజిని పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏ కారణం చేతనైన సంక్షేమ పథకాలు అందని వారికి ఒక్కసారిగా నగదు పంపిణీ చేస్తారు. చిలకలూరిపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విడదల రజిని పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 5640 మందికి 9 కోట్ల 17 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. మంత్రి విడదల రజిని, పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని మంత్రి రజిని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ఏ పథకం కావాలన్నా సంక్షేమ పథకాలను నేరుగా ఇంటికి చేరే విధంగా వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు. ఈ వ్యవస్థల ద్వారా సంక్షేమఫలాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన పథకాలను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు.