Salaar vs PVR Inox: నార్త్ ఇండియాలో 'సలార్'కు అన్యాయం చేయాలని చూస్తే... సౌత్  ఇండియాలో సినిమాను ఇచ్చేది లేదని ప్రభాస్ దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు తేల్చి చెప్పడంతో  పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలకు భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ‘డుంకీ‘తో పాటు ‘సలార్‘కు తగిన ప్రాధాన్యత ఇస్తామని సదరు యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ మేరకు ఓ కీలక ప్రకటన విడుదల చేశాయి. “‘సలార్’ మూవీని PVR, INOX సినిమాస్‌లో విడుదల చేయడం గురించి కొన్ని ఊహాజనిత మీడియా కథనాలు చూశాం. ఈ వార్తలన్నీ అవాస్తవం అని స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఈ ఏడాది మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ‘సలార్’ ఒకటి. షెడ్యూల్ రిలీజ్ డేట్, అంటే 22 డిసెంబర్ 2023న ఈ పాన్ ఇండియా మూవీ PVR INOX సినిమాస్ లో విడుదల కానుంది” అని వెల్లడించాయి.


PVR, INOXకు ‘సలార్’ నిర్మాతల వార్నింగ్


‘సలార్' ఇవాళ (డిసెంబర్ 22న) థియేటర్లలో విడుదలైంది. దాని కంటే ఒక్క రోజు ముందు (డిసెంబర్ 21న) బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన 'డుంకీ' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్త్ ఇండియాలో ఆ సినిమాకు PVR, INOX మల్టీప్లెక్స్ సంస్థలు ప్రయారిటీ ఇచ్చాయి.  ప్రభాస్ సినిమా కంటే షారుఖ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు కేటాయించాయి. దాంతో ప్రభాస్ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నార్త్ లో అన్యాయానికి దిగడంతో దక్షిణాదిలో PVR, INOX స్క్రీన్లలో సినిమా విడుదల చేయబోమని చెప్పేశారు. 


వెనక్కి తగ్గిన PVR, INOX యాజమాన్యాలు


‘సలార్’ నిర్మాతల వార్నింగ్ నేపథ్యంలో PVR, INOX వెనక్కు తగ్గాయి.  ‘సలార్’ మూవీ తమ స్క్రీన్లలో ప్రదర్శించకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉందని భావించాయి. 'సలార్'లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. కేరళలో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. 'KGF'తో ఇండియాలో స్టార్ దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పేరు తెచ్చుకున్నారు. కన్నడలో ఆయన మంచి ఆదరణ ఉంది. తెలుగులో ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో 'సలార్'పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏ థియేటర్లలో ఉంటే ఆ థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తే అవకాశం ఉంది. దీంతో ‘సలార్’ నిర్మాతల డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరించాలని PVR, INOX నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థతో ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించాయి.  అనుకున్న సమయానికే ‘సలార్’ విడుదల అవుతుందని ప్రకటించాయి. అంతేకాదు, దేశ వ్యాప్తంగా బుకింగ్స్ మొదలు పెట్టాయి.


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.


Read Also: అందుకే రణబీర్, బాబీ కిస్ సీన్ తొలగించాం, అసలు విషయం చెప్పిన సందీప్ వంగా