Telangana Police On Pending Traffic Challans: తెలంగాణ(Telangana)లో వాహనదారులకు పోలీసులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ చలానాలు(Pending Traffic Challans) క్లియర్ చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వబోతున్నారు. గతంలో మాదిరిగానే రాయితీ కల్పించబోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వాహనదారులకు ఫైన్స్ వేస్తుంటారు పోలీసులు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో చూసి ఫైన్లు వేస్తుంటే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటోలు తీసి ఫైన్ వేస్తుంటారు. ఇలా రకరరకాల మార్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
పేరుకున్న బకాయిలు
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాళ్లపై చలానాలు వేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. అంతే కాకుండా ఫైన్స్ కూడా వాళ్లు చెల్లించడం లేదు. దీంతో ఈ బకాయిలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులకు చిక్కిన వాళ్లు మాత్రమే స్పాట్‌లో చెల్లించి బయటపడుతున్నారు.
ఒక్కొక్క వాహనంపై వేల రూపాయలు ఫైన్స్ పెండింగ్‌లో ఉంటున్నాయి. అలాంటి పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకునేందుకు పోలీసులు శాఖ ఆఫర్లు ప్రకటిస్తోంది. గతేడాది ఇలాంటి ఆఫర్ ప్రకటించడంతో భారీగా ఫైన్స్ వసూలు అయ్యాయి. ఇప్పుడు కూడా మరోసారి ఆఫర్ ఇవ్వాలని పోలీసులు శాఖ భావిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
గతేడాది మంచి స్పందన
గతేడాది టూ వీలర్ వాహనదారులు తమ వెహికల్‌పై ఉన్న చలానాలో 75 శాతం చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. ఫోర్, హెవీ వెహికల్ పై ఉన్న ఫైన్‌లో 50 శాతం చెల్లిస్తే చాలని పేర్కొన్నారు. ఈ ఆఫర్ ఇవ్వడంతో చాలామంది ముందుకు వచ్చి తమకు ఉన్న పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకున్నారు. గతేడాది తెలంగాణ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 45 రోజుల్లోనే 300 కోట్ల రూపాయలు వసూలు అయింది. అప్పటి వరకు పెండింగ్ ఉన్న వాటితో చూసుకుంటే 60 శాతం వసూలు అయింది.
అప్పటి నుంచి మళ్లీ పెండింగ్ భారం పెరిగిపోయింది. వసూలు కావాల్సిన చలనాలు పేరుకుపోతున్నాయి. వాటిని తగ్గించుకునేందుకు పోలీసు శాఖ మరోసారి క్లియరెన్స్ ఆఫర్ ఇవ్వబోతోందని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన విధి విధనాలు వచ్చే వారం వెలువడే ఛాన్స్ ఉందని అంటున్నారు.