Pallavi Prashanth Arrest: రైతుబిడ్డ కోసం పాటబిడ్డ న్యాయపోరాటం - అందుకే అలా జరిగిందన్న భోలే

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడంపై తన తోటి కంటెస్టెంట్ భోలే షావలి స్పందించాడు. గొడవ వెనుక కారణం ఏంటని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Continues below advertisement

Bigg Boss Winner Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. ఫ్యాన్స్ చేసిన గొడవ వల్ల తను అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫైనల్స్ అయిపోయినప్పటి నుంచి ఫ్యాన్స్ చేసిన ఈ గొడవ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందించారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ మాత్రం కార్లపై జరిగిన దాడి గురించి మాట్లాడారు కానీ.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి మాట్లాడడానికి గానీ, తనకు మద్దతు తెలపడానికి గానీ ముందుకు రాలేదు. భోలే షావలి మాత్రమే పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై మొదటిగా మాట్లాడాడు.

Continues below advertisement

రైతుబిడ్డ ప్రపంచ వేదికపై గెలిచాడు..
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వెళ్లడం వరకు తనకు మంచి ఆదరణ లభించిందని భోలే షావలి అన్నాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ విజయంపై స్పందించాడు. ‘‘అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఒక రైతుబిడ్డ, మట్టిబిడ్డ ఒక ప్రపంచ వేదికపై గెలవడం చాలా హ్యాపీ. ఒక సామాన్యుడు దానిని దక్కించుకోవడం గర్వకారణం. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్‌లో పల్లవి ప్రశాంత్ గెలిచి రికార్డ్ సృష్టించాడు. ఏ సీజన్ ఇంత సక్సెస్ కాలేదు’’ అంటూ పల్లవి ప్రశాంత్ విషయంలో చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు భోలే. ఇక గొడవ గురించి మాట్లాడుతూ.. అది ఒక అనుకోని సంఘటన అనుకోవాలి అంతే అని సింపుల్‌గా చెప్పేశాడు.

నిర్వహకుల తప్పు లేదు..
బయట చాలామంది జనాలు ఉన్నారని, కొంచెం లేట్ అయ్యేవరకు స్టూడియో లోపలే ఉండి, మెల్లగా వెళ్లమని బిగ్ బాస్ నిర్వహకులు తమకు ముందే చెప్పారని భోలే రివీల్ చేశాడు. పోలీసులు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకున్నానని తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన ఆరు సీజన్స్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదు కాబట్టి కారు అద్దాలు పగలగొడతారు, బస్సు అద్దాలు పగలగొడతారు అని ఊహంచలేం కదా అన్నాడు. ‘‘ఒక అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన రైతుబిడ్డకు టైటిల్ దక్కినందుకు ఎక్కువ అభిమానులు వచ్చారు. అది ఆశ్చర్యం. ఆనందంతో ఎక్కువ అభిమానులు వచ్చారు తనకోసం’’ అని భోలే తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఇక కొందరు కంటెస్టెంట్స్ ‌పైనే దాడి జరగడం కూడా తను స్పందించాడు. వచ్చిన 1000 మందిలో 10 మంది ఆకతాయిలు ఉండడం వల్ల అలాంటి సంఘటనలు జరుగుతాయని కానీ అందరూ అలాంటి వాళ్లు కాదు అని భోలే అన్నాడు.

జైలులో వేయడం బాధాకరం..
పోలీసులు కూడా పరిస్థితి అదుపుచేయడానికి చాలా కష్టపడ్డారు కానీ పల్లవి ప్రశాంత్‌ను తీసుకెళ్లి జైలులో వేయడం అనేది బాధాకరమైన విషయం అని అన్నాడు భోలే షావలి. అంతే కాకుండా పలువురు లాయర్లు వెంటనే స్పందించడంపై తను కృతజ్ఞత తెలిపాడు. జడ్జి కూడా మానవతా దృక్పథంతో ఆలోచించారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఈ సంఘటనపై పల్లవి ప్రశాంత్ తరపున లాయర్ కూడా స్పందించాడు. మునుపటి సీజన్స్‌లో ఇలా జరగలేదు కానీ ఈసారి జరగడానికి కారణం ఏంటంటే ఒక రైతుబిడ్డ టైటిల్ గెలవడమే అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాల్సింది అన్నారు.

పోలీసుల వైఫల్యమే కారణం..
‘‘చిరంజీవి, బాలకృష్ణలాంటి హీరోలు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఫ్యాన్స్ వస్తారు. పల్లవి ప్రశాంత్‌కు కూడా అలాగే వచ్చారు. కానీ దానివల్ల తనను అరెస్ట్ చేయడం దురదృష్టకరం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పూర్తిగా దర్యాప్తు చేయాలి కానీ అలా జరగలేదు’’ అని లాయర్ అన్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు చెప్పినా పల్లవి ప్రశాంత్ వినలేదని ప్రశ్నించగా.. శాంతిభద్రతలు చూసుకునే బాధ్యత పోలీసులది కదా అని సమధానం ఇచ్చారు. పల్లవి ప్రశాంత్‌ను మందలించి పంపాల్సింది. కానీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. పల్లవి ప్రశాంత్ తప్పు చేయలేదు కాబట్టి తనను విడుదల చేయాలని నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించామని, ఒక్కరోజులో బెయిల్ వచ్చే అవకాశం ఉందని బయటపెట్టారు. 

Also Read: రైతుబిడ్డ అరెస్ట్ కరెక్టే, హీరోలను కూడా అలా చెయ్యాలి - తమ్మారెడ్డి భరద్వాజ

Continues below advertisement