బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7 Telugu) ఫైనల్స్‌లో జరిగిన గొడవపై ఇప్పటికే ఎంతోమంది కంటెస్టెంట్స్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్, పలువురు ప్రముఖులు స్పందించారు. పోలీసుల చేసిన పని కరెక్ట్ కాదని, ఫ్యాన్స్ పేరుతో ఆకతాయిలు చేసిన అల్లరికి పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్‌ను అరెక్ట్ చేయడం, రిమాండ్‌కు తరలించడం తప్పని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ ఘటనపై స్పందించారు. కానీ మిగతావారి స్పందనకు, ఆయన స్పందనకు చాలా తేడా ఉంది.  పల్లవి ప్రశాంత్ విషయంలో పోలీసులు చేసింది కరెక్టే అని సమర్దించారు. అంతే కాకుండా ఇకపై కూడా ఇదే పద్దతిని ఫాలో అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


అలా చేస్తేనే ధర్మం


‘‘బిగ్ బాస్ ఫైనల్స్ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కాస్త గొడవ జరిగింది. ఆ గొడవలో పబ్లిక్ ప్రాపర్టీ అయిన బస్సులు పగలగొట్టడం, ప్రైవేట్ ప్రాపర్టీ కూడా పగలగొట్టడం, డ్యామేజ్ చేయడం చేశారు కొంతమంది. విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంట వాళ్లంతా. వాళ్లు పగలగొట్టినందుకు ఇప్పుడు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. నిజం చెప్పాలంటే నా ఉద్దేశ్యంలో పోలీసులు పర్ఫెక్ట్‌గా చేశారు. ఎందుకంటే ఈమధ్యకాలంలో రాజకీయ నాయకులకు, సినిమా యాక్టర్లకు ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వాళ్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. సినిమా యాక్టర్ల ఫ్యాన్స్ ఏమో థియేటర్లలో సీట్లు చించేయడం చేస్తూ హడావిడి చేస్తున్నారు. అప్పుడు సినిమా హీరోలను అరెస్ట్ చేయగలరా వీళ్లు? చేయాలి ధర్మంగా అయితే. అప్పుడే ఫ్యాన్స్ మానేస్తారు’’ తన పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ చేసినట్లే.. యాక్టర్లను, రాజకీయ నాయకులను కూడా ఇదే విధంగా అరెస్ట్ చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తమ్మారెడ్డి.


ఒక్కడినే ఎందుకలా చేయాలి..?


‘‘ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు, ఎలక్షన్ అయినప్పుడు గెలిచినవాళ్లకి, ఓడిపోయినవాళ్లకి గొడవలు. ఆ సమయంలో కూడా బయట పబ్లిక్‌కు డిస్టర్బెన్స్ ఉంటుంది, డ్యామేజ్ కూడా ఉంటుంది. అప్పుడు కూడా రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? అంటే పాలసీ తీసుకుంటే అందరికీ తీసుకోవాలి. ఇతడు ఒక్కడినే ఎందుకలా చేయాలి? ఇలాంటి అరాచకం ప్రతీసారి జరుగుతుంది. రాజకీయ నాయకుల దగ్గర జరుగుతుంది, సినిమా యాక్టర్ల దగ్గర జరుగుతుంది. అన్ని చోట్ల జరుగుతుంది. జరిగినప్పుడల్లా దానికి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేస్తాం. అసలైతే ఆ గొడవకు, అతడికి సంబంధం లేదు. అతను ఎక్కడో లోపల షోలో ఉన్నాడు. కానీ బయట చేసినవాళ్లు అతడి ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. చేసిన పద్ధతి నాకు చాలా నచ్చింది. కానీ ఆ పద్ధతి అన్నింటికి అన్వయించుకోవాలి’’ అని సలహా ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.


పబ్లిక్‌ను రెచ్చగొట్టే పద్ధతిలో షో..


ఆ తర్వాత బిగ్ బాస్ షోపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘బిగ్ బాస్ అనే టీవీ షో చేస్తున్నారు. వాళ్ల హైప్ కోసం వాళ్లు చేస్తున్నారు. వాళ్లు ఎవరో తెలియదు. వాళ్లకి మళ్లీ ఫ్యాన్స్. అంతా హైప్ క్రియేట్ చేసి లోనిపోని గొడవ చేసుకోవడం తప్పా ఏం లేదు. షోను షోలాగా చేయాలి కానీ.. ఒక్కొక్కరికీ ఫ్యాన్స్ అని, సైన్యాలు అని ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని వాళ్లని తీసుకొచ్చి ఇలాంటి అల్లర్లు చేయించడం కరెక్ట్ అయిన విషయం కాదు. షో చేయడం తప్పు లేదు కానీ పబ్లిక్‌ను రెచ్చగొట్టే పద్ధతిలో చేయడం కరెక్ట్ కాదు. ఈ ఓటింగ్ అనేది తీసేస్తే బెటర్ ఏమో. పబ్లిక్ గొడవ పడకుండా ఉండే పద్ధతిలో చేస్తే బెటర్. సరిగమప లాంటి షోలలో కూడా ఓటింగ్ ఉంటుంది. కానీ వాళ్లెవరూ ఇలా అల్లర్లు చేయరు. ఈ అల్లర్లు బిగ్ బాస్‌లోనే వస్తుంది. ఇది లేకుండా చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది కానీ.. షో చేసేవాళ్లు, ఛానెళ్ వాళ్లు దానిని సరిచేసుకుంటే బాగుంటుంది’’ అని బిగ్ బాస్ నిర్వహణపై తమ్మారెడ్డి భరద్వాజ సీరియస్ అయ్యారు.


Also Read: పల్లవి ప్రశాంత్‌కు షాక్! బెయిల్ నిరాకరణ - మరో 16 మంది అరెస్టు!