పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సలార్’. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా రివీల్ అయ్యింది. సెప్టెంబర్ 28, 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్ల మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.


‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.  ‘బాహుబలి’ తర్వాత ఆయన హీరోగా నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు ఓ రేంజి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇంకా చెప్పాలంటే సాహో డిజాస్టర్ గా నిలిచింది. పెట్టిన పెట్టుబడి కూడా రాక నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’ సినిమా కూడా చెప్పుకోదగ్గ రీతిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజా మూవీ ‘సలార్’ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రెండు పాన్ ఇండియన్  సినిమాలు అంతగా ప్రభావాన్ని చూపించకపోవడంతో మూడో మూవీ మీద భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ పెట్టుకున్నారు. 


‘కేజీఎఫ్’ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజిని పెంచిన మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. సలార్ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమా కనివినీ ఎరుగని రీతిలో విజయాన్ని సాధిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్-2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన నేపథ్యంలో ‘సలార్’ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది అనుకుంటున్నారు.  ప్రశాంత్ నీల్ టేకింగ్, ప్రభాస్ యాక్టింగ్ ఈ సినిమాను ఓ రేంజికి తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నారు.  
 
విజయ్ కిరగందూర్ నిర్మాతగా, హోంబలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ గతేడాది జనవరి 15న  అట్టహాసంగా మొదలయ్యింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ గతంలోనే వెల్లడించింది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 28, 2023లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు  ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ చూడ్డానికి రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. సీరియస్‌గా కిందికి చూస్తూ నడుచుకుంటూ వస్తున్నట్లు ఇందులో ఉన్నారు. 


ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా సందడి చేయనుంది. ‘కేజీఎఫ్’ సినిమాకు పని చేసిన  టెక్నికల్ టీమే.. ఈ సినిమాకు కూడా పని చేసింది. రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. అటు ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమా కూడా సెప్టెంబర్ 28, 2012లో విడుదల అయ్యింది. కానీ, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ తేదీపై కాస్త ఆందోళనతో ఉన్నారు. మరి తనకు ఫ్లాప్ ఇచ్చిన రోజును ప్రభాస్ ‘హిట్’గా మార్చుకుంటారో లేదో చూడాలి. 






Also Read : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?




Also Read : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.