ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చాటి చెప్పిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి. తన కెరీర్ లో ఓటమి అంటూ ఎరుగని డైరెక్టర్. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. ‘బాహుబలి‘ సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసాని తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. జూ. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవ వసూళ్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ గా రూ. 1,200 కోట్ల రూపాయలను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మీద స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్ టెక్నిషియన్స్ రాజమౌళి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తరఫున ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్స్ కు పంపితే తప్పకుండా అవార్డు దక్కుంచుకుంటుందని చెప్పారు. కానీ, భారత్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ కాకుండా ‘ఛెల్లో షో’ అధికారికంగా నామినేషన్ కు వెళ్లింది. ఆస్కార్ బరిలోకి వెళ్లకపోయినా.. ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతున్నారు.


తాజాగా ఈ సినిమాను హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్‌’లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రదర్శించారు.  లాస్ ఏంజెలిస్‌ లోని  ఐమ్యాక్స్‌లో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ను స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా వెస్ట్రన్ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు..’ అనే పాటకు థియేటర్ అంతా చప్పట్లతో మార్మోగింది. మరికొంత మంది సినీ లవర్స్ స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్స్ చేశారు. సినిమాను చూసి రాజమౌళి ప్రతిభకు హాలంతా నిల్చుని చప్పట్లతో ప్రశంసలు కురిపించింది.  






‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’  ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలను చూసిన  ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్.. “ఇది మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్ కాదు. అమెరికాలో మన సినిమాకు లభించిన స్పందన ఇది. ఎత్తర జెండా’ అంటూ పోస్టు పెట్టింది.   






ఈ సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత రాజమౌళి స్టేజి మీదకు వెళ్లి మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రేక్షకులను నుంచి వచ్చిన స్పందనకు ముగ్దుడయ్యారు. ‘‘నేను అమెరికాలోని ఫిలిం ఫెస్టివల్‌కు వచ్చాననుకున్నాను.   ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులను చూస్తే ఈ ప్రాంతం హైదరాబాద్‌లోని అమీర్ పేట్‌లా కనిపిస్తుంది’’ అన్నారు. మహేష్ బాబు తో కలిసి చేస్తున్న సినిమా తన కెరీర్ లోనే పెద్ద సినిమా అవుతుందని వెల్లడించారు.  ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.