మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రావణాసుర' (Ravanasura). సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై రూపొందుతోంది. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. బుధవారం రవితేజ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయనతో పాటు 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, ఇతర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అందులో ప్రధాన తారాగణం మీద సన్నివేశాలు తెరకెక్కించారు. సెకండ్ షెడ్యూల్‌లో రవితేజ జాయిన్ అయ్యారు.
'రావణాసుర' సినిమా భోగి రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత జనవరి 18న రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించారు. టాకీ పార్ట్ మొత్తాన్ని హైదరాబాద్‌లోని రియల్, నేచురల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక్క సెట్ కూడా వేయడం లేదని తెలిసింది. రవితేజ కెరీర్‌లో ఇలా చేయాలనుకోవడం ఇదే తొలిసారి.
సినిమా ఓపెనింగ్ రోజునే విడుదల తేదీని కూడా 'రావణాసుర' టీమ్ అనౌన్స్ చేశారు రవితేజ. ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరోసారి విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాలో చూపించబోతోన్నారని టీమ్ అంటోంది. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సినిమాకు సంగీతం అందించనున్నారు.
సినిమాలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రాముడిగా కీలక పాత్రలో సుశాంత్ నటించనున్నారు. అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ - మొత్తం ఐదుగురు హీరోయిన్లు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అందరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందట. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.