పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, అలీ నుంచి మొదలు పెడితే... ఈ జనరేషన్ కమెడియన్ 'వెన్నెల' కిశోర్ సహా ప్రతి ఒక్కరితో ఆయన చేసిన కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించాయి. ఒకప్పుడు ఎంటర్టైనర్ సినిమాలు చేసిన రవితేజ... సీరియస్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నారు. 


'జాతి రత్నాలు' దర్శకుడితో రవితేజ సినిమా
'జాతి రత్నాలు'తో ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించిన దర్శకుడు కేవీ అనుదీప్. ఆ సినిమా తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ 'ప్రిన్స్'కు దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ, అనుదీప్ కామెడీ కొందరికి చాలా నచ్చింది. ఇప్పుడు ఆయన రవితేజ హీరోగా సినిమా చేయనున్నారని తెలిసింది. అందులో కథానాయికగా కన్నడ భామకు అవకాశం వచ్చిందని తెలిసింది.


రవితేజ జోడీగా రుక్మిణీ వసంత్!
Rukmini Vasanth signs Telugu movie: రక్షిత్ శెట్టి హీరోగా నటించడంతో పాటు నిర్మించిన 'సప్త సాగరాలు దాటి' గుర్తు ఉందిగా! రెండు భాగాలుగా సినిమా విడుదల అయ్యింది. తెలుగులోనూ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో రవితేజకు జోడీగా నటించే అవకాశం రుక్మిణీని వరించిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.


Also Read: టు మినిట్స్ కూడా లేవుగా - వైరల్ అవుతున్న ప్రభాస్ 'సలార్' డైలాగ్స్



రవితేజ హీరోగా కేవీ అనుదీప్ దర్శకత్వం వహించే సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.


రవితేజ కామెడీ టైమింగ్, ఆయనకు ప్రేక్షకులలో ఉన్న స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కేవీ అనుదీప్ డిఫరెంట్ కామెడీ స్క్రిప్ట్ రెడీ చేశారట. నిజం చెప్పాలంటే... రవితేజ, అనుదీప్ సినిమా చేస్తారని గత ఏడాది వార్తలు వచ్చాయి. అది సినిమా సెట్ కావడం కొంచెం ఆలస్యమైంది. గతంలో 'భీమ్లా నాయక్'ను రవితేజ హీరోగా చేయాలని సితార సంస్థ రెడీ అయ్యింది. పవన్ కళ్యాణ్ రావడంతో సెట్ కాలేదు. ఇప్పటికి రవితేజ, సితార కాంబినేషన్ కూడా సెట్ అయ్యింది. 


రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండకు జోడీగా ఓ సినిమాలోనూ రుక్మిణీ వసంత్ ఛాన్స్ అందుకున్నారని సమాచారం. మరి, ఏ సినిమా ముందు విడుదల అవుతుందో? తెలుగులో ఆమెకు ఏ సినిమా మొదటి సినిమా అవుతుందో? వెయిట్ అండ్ సి.


Also Readహృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఫేక్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?



ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలకు వస్తే... 'షాక్', 'మిరపకాయ్' తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. హిందీ హిట్ 'రైడ్' రీమేక్ అది. దానికి 'బచ్చన్ సాబ్' టైటిల్ ఖరారు చేశారు. రీమేక్ సినిమాలను కొత్తగా ప్రజెంట్ చేయడంలో హరీష్ శంకర్ స్పెషలిస్ట్. ఇంతకు ముందు 'గబ్బర్ సింగ్', 'గద్దలకొండ గణేష్' సినిమాల్లో చూశాం. ఇప్పుడు 'రైడ్' కథను కూడా ఆయన కొత్తగా ప్రజెంట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ కథలో తనదైన మార్పులు, చేర్పులు ఆయన చేశారట.