Kishan Reddy comments On Lok Sabha Elections 2024: ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ (Kishan Reddy) రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరుగుతాయని చెప్పారు. 350కి పైగా స్థానాల్లో బీజేపీ జెండా ఎగరబోతోందన్నారు. మోదీ మూడో సారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ పేపర్ చూసినా కుంభకోణాలు ఉండేవని విమర్శించారు. 


ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా భారత్
ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా దేశాన్ని అగ్రదేశాలకు ధీటుగా నిలబెడుతున్నారని అన్నారు. ప్రపంచంలోనే 5వ బలమైన ఆర్థిక శక్తిగా భారత దేశం ఎదిగిందని చెప్పారు. మొట్టమొదటి సారిగా మోదీ నేతృత్వంలో చంద్ర మండలంపై అడుగుపెట్టామని అన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. రహదారులు దేశ అభివృద్దికి చిహ్నాలు అని, బీజేపీ, మోదీ పాలనలో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులను అద్భుతంగా నిర్మించారని అన్నారు. 


అప్పుల కుప్పగా తెలంగాణ
ఒక కుటుంబం చేతిలో పాలన ఉండటంతో తెలంగాణ అప్పుల పాలైందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూటు మాప్ లేకుండా పాలన చేస్తుందని విమర్శించారు. కొత్త ప్రభుత్వానికి కూడా కొన్ని రోజులు గడువు ఇస్తున్నామని, ఆర్థికంగా ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 


బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసిలో వేసినట్లే
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లే అని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో లేని.. ఇక ఎప్పటికీ రాష్ట్రంలో రాని బీఆర్ఎస్‌కు ఓటు వేసి ఏం లాభం లేదని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రజలు అధికారం ఇచ్చినా బీఆర్ఎస్ ఏం చేయలేకపోయిందని విమర్శించారు. ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 


కుక్కలు చింపిన విస్తరి అవుతుంది
గతంలో దేశంలో విద్యుత్ కోతలు ఉండేవని, మోదీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కోతలు లేవని చెప్పారు. ఎగుమతుల్లో భారత్ దూసుకెళ్తోందని, భారత్ నుంచి 150 దేశాలకు సెల్ ఫోన్ ఎగుమతులను చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణా నుంచి బీజేపీ అత్యధిక సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రంట్‌ల పేరుతో  ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి లాగా చేస్తారని విమర్శించారు.


భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామ మందిరం
వచ్చే ఎన్నికల్లో బీజేపీని, నరేంద్ర మోదీని ప్రజలు, నాయకులు  బలపరచాలని కోరారు. దేశానికి బీజేపీ అవసరం ఎంతో ఉందన్నారు. అయోధ్య రామ మందిరం దేవాలయం మాత్రమే కాదని, భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. ఈ వేడుకలను చూసేందుకు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. అధునాతన టెక్నాలజీ‌తో అయోధ్య రామమందిరం కార్యక్రమాలను లైవ్‌లో చూపించబోతున్నట్లు చెప్పారు.