Couple Committed Suicide In Gudivada: రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే.. ‘హరిచంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను! భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను! తండ్రి బిడ్డలను విడదీస్తాను! అన్నదమ్ముల మధ్య వైరం పెడతాను! ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను! ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తాను!’ అని అందట. డబ్బుకు అంత పవర్ ఉంది మరి. గుడివాడ పట్టణంలో రూ.500 చిచ్చుపెట్టింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.


కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్‌లో విషాద ఘటన జరిగింది. 500 రూపాయల విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలను తీసింది. వివరాలు.. గుడివాడ వాసవి నగర్‌కు చెందిన కొలుసు రాంబాబు, కనకదుర్గ దంపతులు. రాంబాబు ఏలూరులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో బస్సు డ్రైవర్‌​గా పనిచేస్తున్నాడు. శనివారం మద్యం తాగిన రాంబాబు ఇంటికి వచ్చాడు. భార్యను రూ.500 ఇవ్వాలని అడిగాడు. అయితే తనదగ్గర డబ్బులేదని కనకదుర్గ సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. 


భార్య రూ.500 అడిగితే ఇవ్వలేదని మనస్థాపం చెందిన రాంబాబు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య గమనించి వెంటనే తన కొడుకుకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన అక్కడికి వచ్చిన కొడుకు ఉరి వేసుకున్న తండ్రిని కారులో ఆస్పత్రికి తరలించాడు. పరీశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో కొడుకు ఇంటికి ఫోన్ చేసి తండ్రి రాంబాబు చనిపోయినట్లు తల్లి కనకదుర్గకు చెప్పాడు.


భర్త మరణంతో తీవ్ర వేదనకు గురైన కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి ఉరివేసుకొని వేలాడటాన్ని చూసిన షాక్‌కు గురయ్యాడు. ఆమెను కాపాడుకోవాలనుకున్న కొడుకు ఉరికి వేలాడుతున్న తల్లిని కిందకు దింపి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది. తల్లిదండ్రుల మరణ వార్తను సోదరి, బంధువులకు తెలియజేశాడు. పోలీసులకు సమాచారం అందించారు.


ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సీఐ భార్యాభర్తల మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గంటల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ కొడుకును చూసి స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


లోన్ యాప్ వేధింపులు తాళలేక సూసైడ్
లోన్​ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తాళలేక పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామానికి చెందిన యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు .. పరగటిచర్లకు చెందిన గుడిపూడి శ్యాం ప్రసాద్ కుమారుడు విజ్ఞేష్ (22) అనే ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. తన ఫోన్​లోని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లించలేకపోవడంతో రుణ యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. 


సెలవులకు ఇంటికి వచ్చిన విజ్ఞేష్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన విజ్ఞేష్ తల్లిదండ్రులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న రొంపిచర్ల పోలీసులు విజ్ఞేష్ ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని తండ్రి శ్యాం ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.