మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను పూర్తి చేసిన రవితేజ.. 'టైగర్ నాగేశ్వరరావు' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రవితేజకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఓ పోరాట సన్నివేశంలో రవితేజ పాల్గొనగా.. ఆయన పట్టుకున్న తాడు జారిపోవడంతో కిందపడిపోయారట. దీంతో ఆయన కాలికి గాయాలైనట్లు తెలుస్తోంది.
మోకాలికి పెద్ద గాయం కావడంతో పది కుట్లు పడ్డాయట. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అయినప్పటికీ రవితేజ నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంలో వెంటనే షూటింగ్ షూటింగ్ స్పాట్ కి వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రమాదం కొద్దిరోజుల క్రితం చోటుచేసుకోగా.. గురువారం నాడు రవితేజ షూటింగ్ లో పాల్గొనడంతో ఈ విషయం బయటకొచ్చింది.
అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70 వ దశకం నాటి స్టువర్ట్‌పురం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆర్ మదీ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.