ప్రముఖ సినీ నటుడు చలపతిరావు అంత్యక్రియలు ఈ నెల 28న (బుధవారం) నిర్వహిస్తామని ఆయన కుమారుడు రవిబాబు ప్రకటించారు. రవిబాబు సిస్టర్స్ ఇద్దరు అమెరికా నుంచి రావల్సి ఉంది. వారు చలపతిరావు పార్థీవ శరీరాన్ని చూసిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చలపతిరావు భౌతిక కాయాన్ని మహా ప్రస్థానంలోని మార్చురీ ఫ్రీజర్‌లో ఉంచనున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం రవిబాబు నివాసంలోనే ఉంచారు. 


చికెన్ బిర్యానీ తిని, ప్లేట్ ఇచ్చి.. చనిపోయారు: రవిబాబు


‘‘ఆయన లైఫ్‌లో ఎంత ఆనందంగా ఉంటారో అంతే హ్యాపీగా ఆయన వెళ్లిపోయారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన చికెన్ బిర్యానీ, చికెన్ కూరతో భోజనం చేశారు. ఆ తర్వాత ప్లేటు చేతికిచ్చి వాలిపోయారు. హ్యాపీనెస్‌తో పెయిన్ తెలియకుండా వెళ్లిపోయారు. నా సిస్టర్స్ ఇద్దరు యూఎస్‌లో ఉన్నారు. వారు టికెట్స్ తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి టైమ్ పడుతుంది. మంగళవారం ఎర్లీ మార్నింగ్ దిగుతారు. మంగళవారం అంత్యక్రియలు చేయకూడదు అంటున్నారు కాబట్టి బుధవారం మార్నింగ్ చేస్తారు. ఆయన ఎన్టీఆర్‌తో చాలా బాగా ట్రావెల్ అయ్యారు. ఆయన సినిమాలకు రిటైర్డ్ అవుతున్నానని ఫీలవుతున్న టైమ్‌లో నేను చేస్తున్న ఒక సినిమాలో క్యారెక్టర్ పెట్టాను. ఐదు రోజుల కిందటే అందులో యాక్ట్ చేసి వెళ్లిపోయారు. అదే ఆయన చివరి సినిమా. మీ ఫ్రెండ్, మా నాన్నగారు ఇక లేరనేది వాస్తవం’’ అని రవిబాబు పేర్కొన్నారు.


‘లే బాబాయ్.. లే’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం


సినీ నటుడు చలపతిరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ ట్రిప్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చలపతిరావు మరణవార్త విని షాకయ్యారు. వెంటనే చలపతిరావు కుమారుడు రవిబాబుకు వీడియో కాల్ చేశారు. చలపతిరావు పార్థీవ శరీరాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘లే బాబాయ్ లే..’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నందమూరి ఫ్యామిలీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని ఎన్టీఆర్ తెలిపారు. తాతగారి రోజుల నుంచి చలపతి బాబాయ్ తమకు ఎంతో ఆప్తుడని ఎన్టీఆర్ పేర్కొన్నారు.  


చలపతిరావు మా కుటుంబ సభ్యుడు: బాలకృష్ణ


నందమూరి బాలకృష్ణ కూడా చలపతిరావు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘చలపతిరావు గారు తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో చలపతిరావు గారికి అవినాభావ సంబంధం వుంది. నాన్నగారితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు మా కుటుంబ సభ్యుడు. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు.  


చలపతిరావు మరణం కలచివేసింది: చిరంజీవి


చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా తమ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’’ అని పేర్కొన్నారు. 


Also Read: పిల్లలకు అమ్మ, నాన్న అన్నీ తానై - అందుకే చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదా?