Christmas 2022: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు క్రిస్మస్ (Christmas) పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. 2023 సంవత్సరాన్ని ఆశతో, ప్రేమతో, చిరునవ్వుతో స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా నేతలంతా తమ శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! యేసు క్రీస్తు చూపించిన దయ, సౌభ్రాతృత్వ సందేశాన్ని ఈ రోజున అంతా స్మరించుకుందాం. మనలోని ఆనందాన్ని అందరికీ పంచుదాం. తోటి జీవుల పట్ల, పర్యావరణం పట్ల కరుణ, స్ఫూర్తిని కలిగి ఉందాం. - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా తన శుభాకాంక్షలు తెలియజేసారు. యేసు క్రీస్తు గొప్ప ఆలోచనలను గుర్తుచేసుకున్నారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ ప్రత్యేక దినం మన సమాజంలో సామరస్యం, ఆనందాన్ని మరింతగా పెంపొందించాలి. ప్రభువైన క్రీస్తు ఉదాత్తమైన ఆలోచనలను, సమాజానికి సేవ చేయడంపై ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసుకుందాం. - ప్రధాని నరేంద్ర మోదీ
భారత్ జోడో యాత్రతో బిజీగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. "అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ పండుగ సీజన్ మీ అందరికీ ప్రేమ, నవ్వులు, ఆనందాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు, నేతలు కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.