ఇప్పుడు గుండె పోటు ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేం. కొంతమంది ఛాతీ మంటను కూడా గుండె పోటు అనుకునే అవకాశం ఉంది. తీసుకునే ఆహారం కారణంగా ఛాతీమంట కలిగే అవకాశం ఉంది. అలాగే గుండె నొప్పిని కూడా ఛాతీ మంట అనుకునే ఛాన్సు ఉంది. అలాంటప్పుడు పరిస్థితి చేయిదాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెండింటికీ మధ్య తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఆ రెండింటి లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి. ఛాతీ మంట అనేది జీర్ణాశయంలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నడం వల్ల ఛాతీ మంట మొదలవుతుంది. ఇది చిన్న సమస్యే. అయితే గుండె పోటు వేరు. గుండెకు వెళ్లే రక్త నాళాల్లో పూడికలు ఏర్పడడం, గడ్డలు ఏర్పడడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం కలిగి గుండె నొప్పి మొదలవుతుంది. ఇది మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అత్యవసర స్థితి. గుండె పోటును ఛాతీ మంటగా భావించి వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారవచ్చు. అందుకే ఈ రెండింటి లక్షణాలను తెలుసుకోవడం చాలా అవసరం. 


గుండె పోటు లక్షణాలు 
1. గుండె పోటు ఎప్పుడైనా ఛాతీ మధ్యలో నుంచి మొదలవుతుంది. గుండె ఎడమవైపు ఉంటుంది కదా, నొప్పి అక్కడ నుంచి రావాలి కదా అనుకోవద్దు. 
2. ఛాతీ బిగపట్టినట్టు అయి, గుండె పిండేస్తున్నట్టు, దేనితోనో పొడుస్తున్నట్టు అవుతుంది. నొప్పి మెల్లగా మొదలై వచ్చి, పోతూ ఉంటుంది. 
3. నొప్పి మెల్లగా భుజాలకు, దవడలకు, మెడ,  చేతులకు పాకుతుంది. 
4. గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. ఒళ్లంతా చెమట్లు పడతాయి. 
5. తల తిరుగుతుంది. బలహీనంగా మారిపోతారు. 
6. ఊపిరి ఆడక ఇబ్బంది పడతారు. 
7. వాంతులు అయ్యే అవకాశం ఉంది. 


ఛాతీ మంట లక్షణాలు
1. ఛాతీలో సూదితో గుచ్చినట్టు చిన్నగా మంట మొదలవుతుంది. పక్కటెముకల్లోని పొడవాటి ఎముకల్లో కూడా నొప్పి వస్తుంది. 
2. జీర్ణాశయం నుంచి పుల్లటి తేనుపులు రావడంతో పాటూ, గొంతు చేదుగా మారుతుంది. 
3. ఛాతీ నొప్పి గొంతుకు పాకుతుంది. కానీ మెడ, చేతులు, భుజాలు మాత్రం నొప్పి పెట్టవు. 
4. ఆహారం పొట్టలోంచి గొంతులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. 


మీకు వచ్చే నొప్పిని మీరే గుర్తు పట్టాలి. అప్పుడే మీకు వచ్చింది గుండె నొప్పా లేక ఛాతీ నొప్పా అనేది తెలుస్తుంది. 


Also read: మధుమేహం ఉన్నవారు మద్యం తాగితే ఏమవుతుంది?














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.