జీవితం సంతోషంగా సాగాలన్నా.. కష్టసుఖాలను పంచుకోవాలన్నా ఒక తోడు అవసరమని పెద్దలు అంటారు. అయితే, చలపతిరావు జీవితంలో ‘తోడు’ దొరికినా.. విధి వారిని దూరం చేసింది. భార్య ఇందుమతి చనిపోయిన తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకోకుండా.. తన పిల్లలకు అమ్మ, నాన్నా అన్నీ తానై పెంచారు. ఒక వైపు సినిమాలు, మరోవైపు ఇల్లు.. పిల్లలు. ఇలా ఎంత ఒత్తిడి ఉన్నా.. ఆయన ముఖంపై చిరునవ్వు చెరగనిచ్చేవారు కాదు. ఏ రోజు ఆయన తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేవారు. పిల్లలకు అమ్మలోటు తెలియకుండా పెంచారు. 


పెళ్లయిన కొన్నాళ్లకే..


పెళ్లయిన కొన్నాళ్లకే చలపతిరావు భార్య ఇందుమతి అగ్నిప్రమాదంలో చనిపోయారు. చెన్నైలోని ఆయన నివాసంలో అనుకోకుండా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో ఆమె మంటల్లో కాలిపోయింది. ఆమెను బతికించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం లేకపోయింది. అప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్లు. పిల్లల బాగోగులు చూసేందుకు మరోపెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. ఒక వేళ పెళ్లి చేసుకున్నా వచ్చే భార్య తన పిల్లలను బాగా చూసుకోకపోతే సమస్యలు వస్తాయనే భయం కూడా ఆయన్ని వెంటాడింది. దీంతో ఆయన తన అమ్మగారి సాయంతో పిల్లలను పెంచారు. ఆ తర్వాత చాలామంది రెండో పెళ్లి చేసుకోండని సలహా ఇస్తే సున్నితంగా తిరస్కరించేవారు. 


2018లో ప్రమాదం


చలపతిరావు కుమారుడు రవి బాబు నటుడు, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రవిబాబుతోపాటు చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వారు అమెరికాలో ఉంటున్నారు. వాళ్లు ఇండియా ఎప్పుడు వచ్చినా కృష్ణాజిల్లాలోని బల్లిపర్రులోని సొంత ఇంటికి తీసుకెళ్లేవారు. అక్కడ ఆయనకు రెండెకరాల పొలం ఉంది. చలపతిరావు సినిమాల్లో ఎన్ని చెడ్డ పాత్రలు చేసినా.. బయట మాత్రం చాలా మంచిగా ఉండేవారు. మందు, సిగరెట్ అలవాట్లు కూడా లేవు. అందరితో బాబాయ్ అని పిలిపించుకుంటూ ఎంతో సరదాగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. 2018లో ‘సిల్లీ ఫెలోస్’ మూవీ షూటింగ్‌లో చలపతిరావుకు ప్రమాదం జరిగింది. కొన్నాళ్లు ఆయన వీల్ ఛైర్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో నటించారు. 2021లో ‘ఓ మనిషీ నీవెవ్వరు’ అనే మూవీ తర్వాత మళ్లీ నటించలేదు. 


కుమార్తెలు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు


చలపతిరావు కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చలపతిరావు పార్థీవ శరీరం ప్రస్తుతం రవిబాబు నివాసంలోనే ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన పార్థీవ శరీరాన్ని అభిమానుల సందర్శన కోసం ఉంచనున్నారు. ఆ తర్వాత మహా ప్రస్థానంలోని మార్చురీ ఫ్రీజర్‌లో ఉంచనున్నారు.  




Also Read: ఎన్టీఆర్ మనిషిగా ముద్రపడిన చలపతి రావు రియల్ లైఫ్ తెలుసా?