‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న.. వరుస సినిమాలతో సౌత్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ రాణిస్తోంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో కలిసి ‘యానిమల్’ అనే సినిమా చేసింది. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో  సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప2’లో హీరోయిన్ గా చేస్తోంది. అటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘రెయిన్ బో’ సినిమాలోనూ నటిస్తోంది. అటు విక్కీ కౌషల్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పింది.  


రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ


వరుస సినిమాల్తో మంచి జోష్ మీదున్న రష్మిక మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పింది. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’లో ఆమె ప్రధాన పాత్ర పోషించబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందబోతోంది. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రాహుల్ రవీంద్రన్, నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘చిలసౌ’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా నేషనల్ అవార్డు పొందింది. అదే ఉత్సాహంలో నాగార్జునతో కలిసి ‘మన్మథుడు 2’ సినిమా తెరకెక్కించారు.  అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. ఈ సినిమా దెబ్బకు రాహుల్ సైలెంట్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న ఆయన చాలా గ్యాప్ తర్వాత మరో మంచి కథతో దర్శకుడిగా నిరూపించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.






త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’


ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. చిన్న వీడియో గ్లింప్స్ రష్మిక తన  ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘ఖుషి’ సినిమాకి సంగీతం అందించిన అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ఒక అబ్బాయిని ఎంతగానో ప్రేమించే అమ్మాయి గురించి రాహుల్ చెప్పబోతున్నట్లు గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది.   






రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  కాస్ట్యూమ్స్ డిజైనర్ గా శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైనర్ గా ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి వ్యవహరిస్తున్నారు.    


Read Also: సంక్రాంతి బరిలో మరో పెద్ద మూవీ, ‘తంగలాన్’తో రెడీ అంటున్న విక్రమ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial