Randeep Hooda About Veer Savarkar Biopic: సినీ తారలు ఆయా పాత్రల కోసం తమ బాడీని మలుచుకుంటారు. కొందరు బరువు పెరిగితే, మరికొందరు బరువు తగ్గుతారు. పాత్రకు తగినట్లుగా తమ శరీర సౌష్టవాన్ని మార్చుకుంటారు. తాజాగా ఇలాంటి ప్రయోగమే చేశారు బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. ఇంతకాలం హీరోగా కొనసాగిన ఆయన, ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ జీవిత కథ ఆధారంగా ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వీర్ సావర్కర్ జైలు గదిలో రణదీప్ హుడా
రణదీప్ హుడా తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. వీర్ సావర్కర్ చిత్రంలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు. వీర్ సావర్కర్ ను బంధించిన జైలు గదిలో ఆయన దిగిన ఫోటోలను షేర్ చేశారు. సెల్ లోపల సావర్కర్ ఫోటోను పెట్టారు. దాని పక్కనే నేల మీద మూలకు కూర్చుని కనిపించారు. “ఈ రోజు భరతమాత గొప్ప పుత్రులలో ఒకరి పుణ్యతిథి(వర్థంతి). ఆయన మరెవరో కాదు, నాయకుడు, నిర్భయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, తత్వవేత్త, దార్శనికుడు ‘స్వాతంత్ర్యవీర్ సావర్కర్’. అత్యున్నత తెలివి తేటలు, ధైర్యసాహసాలు కలిగిన ఆయన బ్రిటీష్ గడగడలాడించారు.
ఈ చిన్న జైలు గదిలో పుష్కరకాలం పాటు బంధించారు. అతని బయోపిక్ తీస్తున్న సమయంలో, ఆయన ఎలాంటి బాధను అనుభవించారో తెలుసుకునేందుకు నేను ఈ సెల్ లో ఉన్నాను. ఆయన 11 సంవత్సరాల పాటు ఏకాంత నిర్బంధంలో ఉన్న చోట నేను 20 నిమిషాలు కూడా ఉండలేకపోయాను” అని చెప్పుకొచ్చారు. “జైలులో క్రూరమైన, అమానవీయ పరిస్థితులను భరించి, సాయుధ విప్లవాన్ని నిర్మించి, స్ఫూర్తిని కలిగించే వీర్ సావర్కర్ అసమానమైన సహనాన్ని నేను ఊహించాను. దేశ స్వాంత్ర్య సంగ్రామంలో దశాబ్దాల అతడి పట్టుదల, సహకారం సాటిలేనిది. అయినా కొన్ని శక్తులు ఇప్పటికీ అతనిని దూషిస్తూనే ఉన్నాయి” అని రణదీప్ హుడా ఆవేదన వ్యక్తం చేశారు.
4 నెలల్లో 26 కేజీల బరువు తగ్గిన రణదీప్
ఇక ఈ సినిమా కోసం రణదీప్ నాలుగు నెలల్లో ఏకంగా 26 కేజీల బరువు తగ్గినట్టు చిత్ర నిర్మాత ఆనంద్ పండిత్ ఇప్పటికే వెల్లడించారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా తనను తాను మార్చుకున్నట్లు చెప్పారు. సినిమా షూటింగ్ మొదలవడానికి ముందే ఆయన రెడీ అయినట్లు వెల్లడించారు. 86 కేజీలు ఉండే ఆయన ఈ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గినట్లు చెప్పారు. బరువు తగ్గేందుకు రోజూ ఒక ఖర్జూర పండు, 1 గ్లాస్ పాలు మాత్రమే తీసుకున్నట్లు వివరించారు.
Read Also: ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?