Rana Naidu 2: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా కలసి నటించిన తొలి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్ కు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. కంటెంట్ పరంగా మంచి పేరు వచ్చినా ఇందులో ఉండే కొన్ని అసభ్యకర సన్నివేశాలు, డైలాగ్ ల పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఏదేమైనా ఈ వెబ్ సిరీస్ కు పబ్లిక్ లో ఫుల్ క్రేజ్ రావడంతో ‘రానా నాయుడు’ సీజన్ 2 పై ఆసక్తి మొదలైంది. సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘రానా నాయుడు’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే ‘రానా నాయుడు’ తిరిగి వస్తున్నారు అని ఓ గ్లింప్స్ వీడియో ద్వారా తెలియజేశారు. 


నాయుడులు మళ్లీ వచ్చేస్తున్నారు..


‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇందులో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయని పక్కనబెడితే కంటెంట్ మాత్రం చాలానే ఉందంటున్నారు రానా నాయుడు ఫ్యాన్స్. వెంకటేష్ లో మరో కొత్త నటుడిని చూపించారు. రానా, వెంకటేష్ నువ్వా నేనా అన్నట్లు ఇందులో నటించారు. యాక్షన్ సన్నివేశాలు కూడా అదరిపోవడంతో ఈ వెబ్ సిరీస్ కు క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు సెకండ్ సీజన్ ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ‘‘మీరేమి చింతించకండి.. మీ బాధనంతనంటినీ పోగొట్టడానికి నాయుడులు మళ్లీ తిరిగి వస్తున్నారు’’ అంటూ ఓ నోట్ ను కూడా రాసుకొచ్చారు. దీంతో రానా నాయుడు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఈసారి ఎలా ఉంటుందో..


‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ను అమెరికన్ వెబ్ సిరీస్ ‘రే డొనోవన్’ కు రిమేక్ గా రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ విడుదల అయిన మూడు వారాలపాటు ఇండియా టాప్ 10 లో ట్రెండింగ్ అయింది. అంతగా ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తెలుగులో మాత్రం దీనిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇందులో ఉండే అడల్ట్ కంటెంట్, బోల్డ్ డైలాగ్స్ పై వ్యతిరేకత వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ తెలుగు వెర్షన్ ను తొలిగించింది. కానీ అందుకు గల కారణాలను వెల్లడించలేదు. దీంతో ఈసారి తెలుగు వెర్షన్ ఎలా ఉంటుంది. అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా లేదా అనేది తెలియాలంటే సిరీస్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. ఇక ఈ వెబ్ సిరీస్ లో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, సుశాంత్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ పలు కీలక పాత్రలు పోషించారు.



Read Also: సెన్సార్ రిపోర్ట్: ‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్ - సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట!