సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఏలూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది.


విరూపాక్ష’కు A సర్టిఫికేట్


తాజాగా ‘విరూపాక్ష’ చిత్రం సెన్సార్ ఫార్మాలీటీస్  కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్‌ టైమ్ 2 గంటల 20 నిమిషాలుగా లాక్ చేయబడింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ తోనే మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీ ట్రైలర్ తోఅంచనాలను పెంచేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మూవీలో సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట. అయితే, ‘ఎ’ సర్టిఫికెట్ జారీ వెనుక కారణాలు తెలియరాలేదు. హింసాత్మక సన్నివేశాలు, మూఢనమ్మకాలు, చేతబడి తదితర సీన్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.


అంచనాలు పెంచేసిన ట్రైలర్


ట్రైలర్ లో రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథలా కనిపిస్తుంది. చాలా వివరాలను చెప్పకుండానే ట్రైలర్ ను చాలా ఇంట్రస్టింగ్ గా మలిచారు మేకర్స్. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది ట్రైలర్. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ గ్రామంలో ఆకస్మికంగా జరిగే మరణాలు వెనుక గల కారణాన్ని కనుగొనే అన్వేషణలో ఉన్నట్లు కనిపిస్తోంది. స్థానికుల మరణాలకు కారణాలు ఏంటి? దీని వెనక ఎవరు ఉన్నారు? వాటిని హీరో ఎలా కనుగొన్నారు? అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈసారి సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 


ఏప్రిల్ 21న ‘విరూపాక్ష’ విడుదల


‘విరూపాక్ష’ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో సాయి ధరమ్ తేజ్  ఈ చిత్రంపై చాలా హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీలో సునీల్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ‘సుప్రీం’, ‘విన్నర్’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వల్ల వెనుకబడినట్లు కనిపించినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. యాక్సిడెంట్ సమయంలోనే ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదల అయ్యింది. ప్రస్తుతం ‘విరూపాక్ష‘లో నటించారు.   


Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?