India Population:


30 లక్షలు ఎక్కువగా..


ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశమేది అంటే వెంటనే చైనా అని సమాధానం చెప్పేస్తాం. కానీ ఇకపై ఈ సమాధానం చెప్పే వాళ్లందరూ పప్పులే కాలేసినట్టే. ఎందుకంటే...చైనా రికార్డు బద్దలైంది. జనాభాలో చైనాను మించి భారత్‌ దూసుకుపోయింది. ఇది స్వయంగా ఐక్యరాజ్య సమితి వెల్లడించిన విషయం. చైనా కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించిందని స్పష్టం చేసింది యూఎన్. చైనా జనాభాతో పోల్చి చూస్తే...ఎక్కువగానే భారత జనాభా 30 లక్షల మేర పెరిగిందని వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఓ రిపోర్ట్‌ కూడా విడుదల చేసింది. "State of World Population Report, 2023" పేరిట United Nations Population Fund ఈ లెక్కలు వెల్లడించింది. ప్రస్తుతానికి చైనాలో 142 కోట్ల 57 లక్షల జనాభా ఉంది. భారత్‌లో ఈ సంఖ్య 142 కోట్ల 86 లక్షలకు పెరిగిందని తెలిపింది. అంటే...ఇకపై జనాభా విషయంలో భారత్‌ మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో నిలవనున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మూడో స్థానంలో నిలవనుంది. అమెరికా జనాభా ప్రస్తుతానికి 34 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి జనాభాను లెక్కించి ఈ వివరాలు తెలిపింది ఐక్యరాజ్య సమితి. నిజానికి గతంలోనూ యూఎన్ త్వరలోనే చైనా రికార్డుని భారత్ అధిగమిస్తుందని చెప్పింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో చివరిసారి 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టారు. మూడేళ్ల క్రితం జరగాల్సి ఉన్నా...కరోనా సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. ప్రపంచ జనాభాలో మూడింట ఓ వంతు వాటా భారత్, చైనాదే ఉంది. 


పడిపోయిన జనాభా


పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా(China Population) ...ఇప్పుడు ఆ విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే...సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా...భారత్‌ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా...ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే..చైనాను దాటేసి మరీ భారత్‌ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశముంది. చైనా విషయానికొస్తే...జనాభాలో ఈ తగ్గుదల 2050 వరకూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2050 నాటికి కనీసం 11 కోట్ల మేర జనాభా తగ్గుతుందని చెబుతున్నారు. "చైనా ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో అంతరాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా విధానాల్లో మార్పు చేసుకోక తప్పదు" అని స్పష్టం చేస్తున్నారు. 


Also Read: No Jeans: ఉద్యోగులెవరూ జీన్స్ టిషర్ట్‌లు వేసుకోవద్దు, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం