Apple Savings Account: ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను అమ్మే కంపెనీగానే మనకు తెలిసిన ఆపిల్‌, ఆర్థిక సేవల రంగంలోనూ ఎంతోకాలంగా పని చేస్తోంది. ఈ రంగంలో మరింత బలంగా చొచ్చుకెళ్లడం కోసం సొంతంగా ఒక పొదుపు ఖాతాను ప్రకటించింది. గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్‌తో కలిసి ఈ పొదుపు ఖాతాను ప్రారంభించింది. దీనిలో డబ్బులు జమ చేసిన ఖాతాదార్లు బలమైన వడ్డీ రేటును (Interest Rate on Apple Saving Account) పొందుతారు. యాపిల్ కార్డ్ (Apple Card) వినియోగదార్లు ఈ సేవింగ్స్ ఖాతా మీద 4.15 శాతం వడ్డీని పొందుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదలైన దేశంలోని అగ్ర బ్యాంకుల పొదుపు ఖాతా వడ్డీ రేటు కంటే ఈ వడ్డీ చాలా ఎక్కువ. దీంతో పాటు మరెన్నో సౌకర్యాలను ఈ ఖాతా ద్వారా ఆపిల్‌ అందిస్తోంది.


ఆపిల్‌ పొదుపు ఖాతా సౌకర్యాలు:
1. బ్యాంకులో పొదుపు ఖాతాను ప్రారంభిస్తే, ఖాతాదార్లు కనీస నిల్వను ఉంచాలి. కానీ ఆపిల్‌ సేవింగ్స్ అకౌంట్‌లో 'మినిమమ్‌ బ్యాలెన్స్' ఇబ్బంది లేదు.
2. ఐఫోన్ వినియోగదార్లు వాలెట్ యాప్ ద్వారా ఖాతా తెరవవచ్చు.
3. ఆపిల్‌ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించాక, అన్ని లావాదేవీలు స్వయంచాలకంగా సేవింగ్స్ ఖాతాలో కనిపిస్తాయి.
4. ఈ ఖాతా ద్వారా చేసే లావాదేవీల మీద ఎలాంటి రుసుములు విధించరు.
5. ఈ ఖాతాలో ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు, కనీస డిపాజిట్‌ పేరిట ఆంక్షలు లేవు.


SBI పొదుపు ఖాతాపై వడ్డీ రేటు      
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన SBI, పొదుపు ఖాతాలో (SBI Saving Account) 10 కోట్ల రూపాయల బ్యాలెన్స్‌ వరకు 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ మొత్తం ఉన్న ఖాతాలపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.


HDFC బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ రేటు        
రూ. 50 లక్షల వరకు డిపాజిట్ల మీద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank Saving Account)  3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ల మీద 3.50 శాతం వడ్డీ అందుతోంది.


పంజాబ్ నేషనల్ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ రేటు      
దేశంలో రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank Saving Account), రూ. 10 లక్షల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రూ. 10 లక్షల నుంచి రూ. 100 కోట్ల డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్ల మీద 3 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది.


ICICI బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ రేటు
ఐసీఐసీఐ బ్యాంక్, పొదుపు ఖాతాలో (ICICI Bank Saving Account) రూ. 50 లక్షల వరకు డిపాజిట్లపై 3% వడ్డీ రేటును తన కస్టమర్లకు అందిస్తోంది. రూ. 50 లక్షలకు పైబడిన డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీని అందిస్తోంది.